Swathi Muthyam Review: స్వాతిముత్యం సినిమా రివ్యూ & రేటింగ్!
November 4, 2022 / 02:40 PM IST
|Follow Us
|
Join Us
Cast & Crew
బెల్లంకొండ గణేష్ (Hero)
వర్ష బొల్లమ్మ (Heroine)
రావు రమేష్, గోపరాజు రమణ, వెన్నెల కిషోర్ (Cast)
లక్ష్మణ్ కె.కృష్ణ (Director)
సూర్వదేవర నాగవంశీ (Producer)
మహతి స్వరసాగర్ (Music)
సూర్య (Cinematography)
Release Date : అక్టోబర్ 05, 2022
తెలుగు తెరకు పరిచయమైన మరో వారసుడు బెల్లంకొండ గణేష్. నిజానికి ఇతడి తొలి చిత్రం పవన్ సాదినేని దర్శకత్వంలో మొదలైనప్పటికీ.. లాక్ డౌన్ కారణంగా ఆ ప్రొజెక్ట్ అటకెక్కి.. రెండో సినిమాగా మొదలైన “స్వాతిముత్యం” తొలి చిత్రంగా విడుదలైంది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించింది? హీరోగా బెల్లంకొండ గణేష్ నిలదొక్కుకోగలిగాడా? అనేది చూద్దాం..!!
కథ: మనసులో ఎలాంటి కల్మషం లేని ఓ సాధారణ యువకుడు బాలమురళీకృష్ణ ( బెల్లంకొండ గణేష్). కరెంట్ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తుంటాడు. బాలమురళీకృష్ణకు పెళ్లి చేయడం కోసం సంబంధాలు చూస్తూ ఉంటారు అతని తల్లిదండ్రులు. అలా అతనికి ఒక పెళ్ళిచూపుల్లో పరిచయమవుతుంది భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ). ఇద్దరూ ఒకర్నొకరు పరిచయం చేసుకొని, ప్రేమించుకొని.. పెళ్లి దాకా వెళ్తారు.
కట్ చేస్తే.. బాలమురళీకృష్ణకు పెళ్ళికి ముందే ఒక కొడుకు ఉన్నాడని తెలుస్తుంది. దాంతో పెళ్లి ఆగిపోతుంది. అత్యంత అమాయకుడైన బాలమురళీకృష్ణకు పెళ్ళికి ముందే కొడుకు ఎలా పుట్టాడు? బాలు-భాగిల ప్రేమ ప్రయాణం పెళ్లి వరకూ వెళ్ళిందా లేదా? అనేది “స్వాతిముత్యం” కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా బెల్లంకొండ గణేష్ బొటాబోటి మార్కులతో పాసయ్యాడు. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో చాలా వర్క్ చేయాల్సి ఉంది. అయితే.. దర్శకుడు తెలివిగా ఎమోషన్స్ & కామెడీని మిగతా క్యాస్టింగ్ తో చేయించి బెల్లంకొండను గట్టెక్కించాడు. వర్ష బొల్లమ్మ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. మెయిన్ క్యాస్ట్ కంటే ఎక్కువగా ఆకట్టుకున్న నటులు రావు రమేష్ & గోపరాజు రమణ. ఈ ఇద్దరి కామెడీ టైమింగ్ & డైలాగ్స్ థియేటర్లలో ఆడియన్స్ కడుపుబ్బ నవ్వేలా చేశాయి. వెన్నెల కిషోర్ కూడా పంచ్ డైలాగులతో అలరించాడు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ కథను రాసుకున్న విధానం బాగుంది. ఒక సాదాసీదా కథలో స్పెర్మ్ డొనేషన్ కాన్సెప్ట్ ను ఇన్వాల్వ్ చేసి, అది కూడా ఎక్కడా అసభ్యత లేకుండా, ప్రేక్షకులు ఎక్కడా ఇబ్బందిపడకుండా తెరకెక్కించిన విధానం అభినందనీయం. మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు లక్ష్మణ్.
మహతి స్వరసాగర్ సంగీతం, నేపధ్య సంగీతం బాగున్నాయి. అలాగే సూర్య కెమెరా వర్క్. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా కథకు తగ్గట్లుగా ఉంది.
విశ్లేషణ: ఒక సినిమాను ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఆస్వాదించి, ఆనందించగలిగేలా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ ప్రతిభను గుర్తించడం కోసం, రావురమేష్-గోపరాజు రమణల హిలేరియస్ కామెడీ ఎపిసోడ్స్ అన్నీ కలగలిసి “స్వాతిముత్యం” చిత్రాన్ని మంచి హిట్ సినిమాగా నిలిపాయి.