వివాదమో.. విజయమో.. వర్మ మాత్రం వార్తల్లోనే ఉన్నారు. సినిమాలు.. రాజకీయాలు.. రోజుకి ఏదోకదానిపై .. పగలు రాత్రి అని తేడా లేకుండా ట్వీట్ చేయడం.. దానిపై రోజంతా చర్చ సాగడం.. ఛానల్ వారికి వర్మ ట్వీట్ బ్రేకింగ్ న్యూస్ కావడం .. అందుకే 2017 లో సినిమా పరిశ్రమవైపు ఒక కన్ను. వర్మ వైపు మరో కన్ను వేయడం మీడియా వారికి అలవాటు అయింది. అంతలా ప్రాచుర్యం పొందిన వర్మ 2017 లో చేసిన ట్వీట్స్ ప్రకటనలపై ఓ రౌండప్ వేస్తే.. వర్మ ఈ సంవత్సరం తీసిన సినిమాలకంటే ప్రకటించిన సినిమాల సంఖ్యే ఎక్కువ. నయీం, నూక్లియర్, కేసీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్, ఇలా చాలానే ప్రాజెక్టులు ముందుకు కదలలేదు. ఈ ఏడాది వర్మ నుంచి సర్కార్-3 సినిమా మాత్రమే వచ్చింది.
మరో సినిమా నాగార్జున తో సీరియస్ గా చేస్తున్నారు. ఇక కొత్తగా వెబ్ సిరీస్ లోకి ఎంటర్ అయిన వర్మ గన్స్&థైస్, మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తీ హై వంటి వీడియోస్ తో సంచలనం సృష్టించారు. సెన్సార్ అడ్డులేకపోవడంతో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా పెట్టి ఎక్కువగానే వ్యూస్ రాబట్టారు. కడప అనే వెబ్ సిరీస్ మొదలుకాకముందే ట్రైలర్ తో వార్తల్లో నిలిచింది. పవన్ పై ఒకసారి విమర్శలు.. మరోసారి ప్రసంశలు.. అర్జున్ రెడ్డి సినిమాకి ఫిదా అయిపోవడం.. నంది అవార్డుపై ఏకంగా పాట రూపొందించడం.. ఇదే వర్మ ఈ ఏడాది చేసిన ట్వీట్స్ లో హైలెట్ గా నిలిచాయి. వచ్చే ఏడాది నాగార్జున సినిమాతోనైనా వివాదాలతో కాకుండా విజయంతో వార్తల్లో నిలుస్తారని అతని శిష్యులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.