మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శ్రీయ,అంజనా సుఖాని హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాన్ శీను’. దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇదే డెబ్యూ మూవీ. శ్రీహరి,కస్తూరి, వంటి నటీనటులు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు.ఆర్.ఆర్.వెంకట్ మరియు వి.సురేష్ రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2010వ సంవత్సరం ఆగష్ట్ 6న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అప్పటికి ‘ఆంజనేయులు’ ‘శంభో శివ శంభో’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజకి స్ట్రాంగ్ కంబ్యాక్ ను ఇచ్చింది.
తర్వాత రవితేజ,గోపీచంద్ కాంబినేషన్లో ‘బలుపు’ ‘క్రాక్’ వంటి సినిమాలు ఇచ్చాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఇవి కూడా రవితేజకి కంబ్యాక్ మూవీసే..! ఇదిలా ఉండగా.. ‘డాన్ శీను’ వంటి హిట్ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదట. ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తే రవితేజ వద్దకు వెళ్ళిందట. ఈ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో కాదు ఒకరు ప్రభాస్ మరొకరు గోపీచంద్. దర్శకుడు గోపీచంద్ మలినేని మొదట ఈ కథని ప్రభాస్ కు వినిపించాడు. కానీ అప్పటికే అతను దశరథ్ డైరెక్షన్లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ మూవీకి కమిట్ అవ్వడం… అలాగే ‘డాన్ శీను’ మూవీ కథ ప్రభాస్ చేసిన ‘బుజ్జిగాడు’ కథకి దగ్గరగా ఉండడంతో అతను నొ చెప్పాడట.
ప్రభాస్ నొ చెప్పడంతో గోపిచంద్ కు కూడా ఈ కథని వినిపించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. దిల్ రాజు ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చాడు. కానీ గోపీచంద్ అప్పటికి ‘గోలీమార్’ ‘వాంటెడ్’ వంటి సినిమాలకి కమిట్ అవ్వడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు.ఇక ఆ ఇద్దరు హీరోలు నొ చెప్పడంతో దిల్ రాజు ఈ కథని హోల్డ్ లో పెట్టారట. ఎక్కువ రోజులు వెయిట్ చేయడం ఇష్టం లేని గోపీచంద్ ‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ వారికి ఈ కథని చెప్పి ఓకే చేయించుకున్నాడు. వాళ్ళ దగ్గర రవితేజ బల్క్ కాల్షీట్లు ఉండడంతో ఈ ప్రాజెక్టు చక చకా సెట్స్ పైకి వెళ్లిపోవడం.. 77 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలవ్వడం జరిగిపోయాయి.