పండగ వస్తే సరి.. అయితే సినిమాలు లేదంటే సినిమాల అప్‌డేట్‌లు నిండిపోతుంటాయి. అలా ఈ ఏడాది ఉగాదికి కూడా టాలీవుడ్ నుండి పెద్ద ఎత్తున అప్‌డేట్స్ వచ్చాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా… కుర్ర స్టార్, సీనియర్ స్టార్ అనే మాట లేకుండా చాలామంది హీరోలు వాళ్ల సినిమాల పోస్టర్లు, అప్‌డేట్లు రిలీజ్ చేశారు. వాటిలో ఏది బాగుంది, ఏది బాగోలేదు అనే విషయంలో చర్చ నడుస్తోంది. అయితే ఇదే సమయంలో మరో విషయం ఆలోచించాలి. అదే ఈ పండగకు ఎవరు మిస్ అయ్యారు అని.
ఎందుకంటే స్టార్ హీరోలు చాలామంది ఉగాది పండగకు డుమ్మా కొట్టారు. ఎలాంటి అప్‌డేట్, పోస్టర్ రిలీజ్ చేయకుండా పండగను ముందుకు నడిపేశారు. అలాంటివాళ్లెవరు అనే లిస్ట్ తీస్తే.. మహేష్‌బబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ పేర్లు కనిపిస్తాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించి టైటిల్ పోస్టర్ కానీ, టీజర్ కానీ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ అనుకున్నట్లుగా అవేమీ రాలేదు. రామ్ చరణ్ – శంకర్ సినిమా పరిస్థితి కూడా ఇంతే.
మహేష్ సినిమా అంటే షూటింగ్ చేసింది పక్కన పెట్టేశారు కాబట్టి స్టఫ్ ఏమీ లేదు రిలీజ్ చేయడానికి. అయితే చరణ్ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ అయ్యింది. అయినప్పటికీ టీమ్ నుండి ఎలాంటి సమాచారం లేదు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు, ఇప్పట్నుంచి ప్రచారం ఎందుకని అనుకున్నారేమో ఎలాంటి పోస్టర్ ఇవ్వలేదు. కనీసం సినిమా వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్ రిలీజ్ చేసినా ఫ్యాన్స్ హ్యాపీ అయ్యేవారు. ఇక అల్లు అర్జున్ సంగతి సరేసరి.
‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ చేయని సందడి లేదు. రిక్వెస్ట్‌లు లేవు. కానీ ఉగాది నాడు టీమ్ నుండి ఎలాంటి స్పందనా లేదు. అయితే బన్నీ పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8న ఏదో స్పెషల్ సర్‌ప్రైజ్ ఉందని సమాచారం ఇప్పటికే ఉంది. దీంతో ఆ రోజు కోసం ఆగారు వాళ్లంతా. అయితే ఆ అప్‌డేట్ టీజర్ అయినా ఇవ్వాల్సింది. ప్రభాస్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. చేతిలో చాలా సినిమాలున్నా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.
‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, మారుతి సినిమా, ‘స్పిరిట్’.. ఇలా వరుస సినిమాలున్నా వేటి నుండీ సమాచారం లేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఉసూరు మన్నారు. ఇక పవన్ కల్యాణ్ సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ లాగే వరుస సినిమాలున్నాయి. అయితే అప్‌డేట్స్ మాత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’, ‘వినోదాయ చిత్తాం’ రీమేక్ ఇలా చాలానే ఉన్నాయి అయినా ఏం లాభం లేదు.