ఓ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయకపోతే ఆ విషయం చెబుతూ, కొంతమంది అయితే సారీ చెబుతూ నోట్ రిలీజ్ చేస్తుంటారు. దీని కోసం పెద్ద హంగామా లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుంటారు. అయితే డేట్ మార్పు విషయం అందరికీ తెలియకపోయినప్పుడో, లేదంటే నిర్ణయం తీసుకున్న వెంటనో చెబుతుంటారు. కానీ విషయం అందరికీ తెలిసోయి, రిలీజ్ ఆ డేట్‌కి కష్టం అని అర్థమైపోయినాక నోట్ రిలీజ్ చేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు అదే పని చేసింది. ‘టిల్లు స్క్వేర్’ టీమ్.
2022లో ‘డీజే టిల్లు’ (Tillu Square) అంటూ వచ్చిన సాలిడ్ హిట్ కొట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమాతో సిద్ధు కాస్త ‘స్టార్ బాయ్’ అయిపోయాడు. ఆ సినిమాలో హీరో పాత్ర యాటిట్యూడ్, పండించిన వినోదానికి ఇప్పటికీ ప్రేక్షకులు ఖుష్‌గానే ఉంటారు. అలాంటి పాత్రను మళ్లీ తీసుకొస్తూ ‘టిల్లు స్క్వేర్’ అని పేరు పెట్టారు. ఈ సినిమా చాలా నెలల క్రితమే ప్రారంభమైంది. అయితే కాస్టింగ్‌లో సమస్యలు, క్రూలో ఇష్యూల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్ విషయంలో చెప్పిన విషయం వీలుకాలేదు. సినిమా రీసెంట్ డేట్ అయితే సెప్టెంబరు 15. ఆ డేట్‌కి సినిమాను తీసుకొస్తామని కొన్ని నెలల క్రితం చెప్పారు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ వాళ్లు. కానీ సినిమా నుండి ఎలాంటి స్టఫ్ రాకపోవడం, ప్రచారం లేకపోవడంతో సినిమా ఆ డేట్‌కి రానట్లే అని ఫిక్స్ అయ్యారంతా. కొత్త డేట్ ఎప్పుడిస్తారో అని అనుకుంటుండగా.. ‘సెప్టెంబరు 15న రాలేకపోతున్నాం.. సారీ’ అంటూ ఓ నోట్ రిలీజ్ చేశారు.
‘‘సెప్టెంబర్ 15 సినిమా రిలీజ్ చేయడం లేదు. అతి త్వరలో అదిరిపోయే డేట్‌తో, మరింత మంచి స్టఫ్‌తో మిమ్మల్ని పలకరిస్తాం’’ ఓ నోట్ రిలీజ్ చేశారు. క్వాలిటీ కోసం జాప్యం తప్పడం లేదని, బెస్ట్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ… ఇంత హఠాత్తుగా ఈ క్షమాపణ ఎందుకు అనేది అర్థం కావడం లేదు. సెప్టెంబర్ 15న సినిమా రావడం లేదని వారాల క్రితమే అందరికీ తెలుసు. మరి ఇప్పుడు సారీ ఎందుకు అనేది అర్థంకాని విషయం.