బిగ్ బాస్ సీజన్ 2లో ఎందుకు హైలైట్ అయ్యాడో, ఎలా అయ్యాడో తెలియదు కానీ.. ఉన్నట్లుండి కౌశల్ అనే పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. ఇక మనోడి పేరు మీద ఆర్మీలు పెట్టేసి ర్యాలీలు కూడా చేసేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయ్యాక మనోడి హల్ చల్ చూసి కౌశల్ ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకున్నారు అందరూ. అయితే.. మనోడు అక్కడికి, ఇక్కడికీ వెళ్ళి ఈవెంట్స్ చేయడం మినహా పెద్దగా సాధించిందేమీ లేదనుకోండి. మధ్యలో అనవసరంగా మాట్లాడిన కొన్ని మాటల వల్ల పరువు కూడా పోగొట్టుకున్నాడు. ఒక రెండు రోజుల క్రితం కౌశల్ ఆర్మీలో కీలక సభ్యులైన కొందరు ఒక టీవీ చానల్ లైవ్ లోకి వచ్చి కౌశల్ తమని మోసం చేశాడని, కౌశల్ ఆర్మీని తన స్వార్ధానికి వాడుకుంటున్నాడని ఆధారాలతో సహా చూపించేసరికి ఆర్మీ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
కట్ చేస్తే.. కాస్త లేట్ గా ఆ అభియోగాలపై ఇవాళ స్పందించాడు కౌశల్ మరియు అతని సతీమణి. ప్రెస్ మీట్ పెట్టి మరీ మీడియా వాళ్ళ మీద అరవడం, మైకులు పట్టుకొని ఊగిపోవడం తప్ప ఒక క్లారిటీ అనేది మాత్రం ఇవ్వలేకపోయాడు. ముఖ్యంగా తనకు గిఫ్ట్ ఎమౌంట్ గా వచ్చిన 50 లక్షల్లో ఇప్పటివరకు 25 వేలు మాత్రమే స్పెండ్ చేశానని, ఒకరి తర్వాత ఒకరికి సహాయం చేస్తానని కౌశల్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సహాయం అంటే ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్ కి ఆ ఎమౌంట్ ను అందజేయాలి కానీ.. ఇదేం వ్యవహారం అని అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. గంటసేపు జరిగిన ఈ ప్రెస్ మీట్ లో కౌశల్ అరవడం తప్ప ప్రశాంతగా కూర్చుని క్లారిటీ ఇచ్చింది మాత్రం లేదు. మరి ఈ గోల ఇంతటితో ఆగుతుందా లేక ఇంకా సాగుతుందా అనేది చూడాలి.