టాలీవుడ్‌లో హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నటి అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో హీరోలకు సమానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్నారు అనుష్క. ఒకవైపు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించడం టాలీవుడ్‌లో ఆమెకే సాధ్యమైంది. ‘వేదం’ సినిమాలో సరోజ క్యారెక్టర్‌లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘అరుంధతి’, ‘వేదం’, ‘రుద్రమదేవి’ సినిమాల్లోని నటనకు గానూ ఆమె ఫిలిమ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు.
నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు స్వీటీ. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆ తరవాత ‘విక్రమార్కుడు’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘చింతకాయల రవి’, ‘అరుంధతి’, ‘బిల్లా’, ‘సింగం’, ‘వేదం’, ‘ఖలేజా’, ‘మిర్చి’ వంటి సినిమా హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను అమాంతం పెంచేసుకున్నారు. ఇక ‘బాహుబలి’ సినిమాలో దేవసేన పాత్ర ఆమె కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచింది. సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తెలియజేసింది.
చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించి మెప్పించారు. 2021లో విడుదలైన ‘నిశ్శబ్దం’ ఆమె గొప్ప నటనకు మరో ఉదాహరణగా నిలిచింది. అయితే, ఆ తరవాత చాలా విరామం తీసుకుని ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అనుష్క అందం, అభినయం చూసి ఆమె అస్సలు మారలేదని అంతా అన్నారు. అయితే, ఇప్పుడు అనుష్క మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారట. వరుసపెట్టి సినిమాలు రాబోతున్నాయట. దీనిలో భాగంగా ముందుగా ‘భాగమతి 2’ రాబోతోంది. ఈ రోజు (నవంబర్ 7) అనుష్క శెట్టి పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఆమె (Anushka) 50వ సినిమాగా ‘భాగమతి 2’ను ప్రకటించనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘భాగమతి’ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ సంస్థే నిర్మించింది. అంతెందుకు ఇటీవల వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కూడా యూవీ క్రియేషన్స్ వారిదే. ఇప్పుడు ‘భాగమతి 2’ కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుంచే రానుంది. ‘భాగమతి’ సినిమాకు జి.అశోక్ దర్శకత్వం వహించారు. మరి రెండో పార్ట్‌కు కూడా ఆయనే దర్శకుడా లేకపోతే ఎవరైనా మారతారా అనేది రేపు తెలుస్తుంది.