మొన్నీమధ్య వరకు ప్రభాస్ టీమ్ నుండి ఓ అనధికారిక వార్త బయట సర్క్యులేట్ అవుతుండేది. వరుస పెద్ద సినిమాలు చేస్తున్న ప్రభాస్ అర్జెంట్‌గా ఓ చిన్న కథ కావాలని. వీలైనంత త్వరగా ఆ సినిమా పూర్తయిపోవాలని, రిలీజ్ అయిపోవాలని చెప్పేవారు. ఈ క్రమంలో మారుతితో ప్రభాస్ సినిమా చేస్తారని కూడా అన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే మాట అంటున్నాడని టాక్. తనకో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథ కావాలని, వేగంగా పూర్తవ్వాలని అంటున్నారట.
గతేడాది ఆఖరున ‘పుష్ప’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బన్నీ. ఆ వెంటనే ‘పుష్ప 2’ మొదలవుతుందని తొలుత చెప్పినా ఆరు నెలలు దాటుతున్నా ఇంకా సినిమా మొదలవ్వలేదు. సినిమా స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాలేదని, చాలా లింక్‌లు క్లియర్ చేయాల్సి ఉందని, అలా కొంత మేర కాస్టింగ్ ఎంపిక కూడా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభానికి ఇంకొంత కాలం పడుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆలస్యమైనా ఫర్వాలేదు, మంచి సినిమా కావాలి అని బన్నీ అనుకుంటున్నాడట.
ఈ నేపథ్యంలో బన్నీ అర్జెంట్‌గా ఓ టాలీవుడ్ సినిమా చేద్దాం అనుకుంటున్నాడట. అదేంటి టాలీవుడ్ అనుకుంటున్నారా? ఆయన ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కదా. అందుకే టాలీవుడ్ కమర్షియల్ సినిమా చేద్దామని చూస్తున్నాడట. దీని కోసం బన్నీ టీమ్ వేట మొదలు పెట్టిందట. ఫుల్ మాస్ కమర్షియల్ అంశాలు ఉంటూ, వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూసుకోవాలని చెబుతున్నారట. మొత్తం హైదరాబాద్‌లోనే సినిమా తీస్తే వేగంగా పూర్తవుతుందని వారి ఆలోచనట.
మరి అలాంటి కథ, దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రభాస్ కూడా ఇలానే వెతికి వెతికి మారుతితో సినిమా అన్నాడు. హారర్ కామెడీ సినిమా అంటూ ఆ సినిమా నేపథ్యం కూడా బయటకు వచ్చింది. కానీ ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇప్పుడు బన్నీ ఆలోచన ఫలిస్తుందా? ఈ సినిమా అయినా మొదలవుతుందా అనేది చూడాలి. ఆలోచన బాగున్నా.. ఎక్కడో ఏదో అడ్డుపడుతోందని అనిపిస్తోంది కదా. అదే ‘పాన్ ఇండియా’ ఇమేజ్ అనే పొర అని అనొచ్చు.