అమలా పాల్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రాంగోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో నాగ చైతన్య హీరోగా రూపొందిన ‘బెజవాడ’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అటు తర్వాత రాంచరణ్- వి.వి.వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నాయక్’, పూరి జగన్నాథ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇద్దరమ్మాయిలతో’, నాని హీరోగా తెరకెక్కిన ‘జెండా పై కపిరాజు’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు.
ఎక్కువగా తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ లలోనే నటిస్తూ వచ్చింది. ఈమె తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణాలు ఏంటి అన్నది తెలీదు కానీ.. ఈమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 12 ఏళ్ళు కావస్తోంది. ఈ సందర్భంగా ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ షాకింగ్ విషయాలు తెలియజేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “కెరీర్ ప్రారంభంలో నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నా కంటే పెద్ద వయసు కలిగిన హీరోలతో నటించాను.
ఆ టైంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ ఓ నటిగా వాళ్ల నుండి నేను ఎంతో నేర్చుకున్నాను.ఇక రియల్ లైఫ్ లో కూడా నేను చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను.అప్పుడు సక్సెస్ కోసం పాకులాడినట్లు అనిపించింది.అలాగే వాస్తవానికి దూరంగా బతుకుతున్నట్లు కూడా అనిపించింది.ఆ టైంలో పాజిటివ్ గా ఆలోచించడం అనేదాన్ని దూరం చేసుకుని చాలా మధనపడ్డాను.
సినిమాలకు గుడ్‌బై చెప్పాలనిపించింది. మా నాన్న చనిపోయిన టైంలో ఎన్నో భయాలు వెంటాడాయి. కోలుకోవడానికి టైం పట్టింది. కానీ పోరాడి నిలబడగలిగాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె పలు ఓటీటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది.