అనుష్క సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఎక్కువ రోజులు ఉండను.. వెళ్లిపోతాను అనుకుందట. ఈ మాట ఆమెనే చాలాసార్లు చెప్పింది. తొలి నాళ్లలో ఆమె సినిమాలకు వచ్చిన ఫలితాలు కూడా ఇంచుమించు అలానే ఉన్నాయి. అయితే ఆ తర్వాత అనుష్క సినిమాలకు క్రేజ్ పెరిగింది, వరుస ఛాన్స్‌లు వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోలకు వచ్చినంత క్రేజ్‌ను తెచ్చుకుంది. అలా ఇప్పటికి 18 ఏళ్ల నుండి ఆమె ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తోంది. ఓసారి కెరీర్‌ను చూస్తే ఎలా ఉంది అనుష్క అని అడిగితే.. ఈ విషయాలు చెప్పింది.
ఇంత లాంగ్ కెరీర్ నాకు వస్తుందని అసలు ఊహించలేదు అని చెప్పింది. ఓ ప్రణాళిక ప్రకారం తానెన్నడూ ముందుకెళ్ల లేదని, అంత తెలివితేటలు కూడా తనకు లేవు అని బోల్డ్ కామెంట్ చేసింది. మంచి కథల్లో భాగమవ్వాలి, మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాలనే తన ఆశ తప్ప ఇంకేమీ లేదని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో భయంభయంగానే సెట్స్‌లోకి వచ్చేదాన్ని అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది స్వీటీ.
సెట్లోకి వెళ్లి ధైర్యంగా డైలాగ్ చెప్పగలనా, తనను నమ్మి ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలనా, దర్శక నిర్మాతలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా అనే డౌట్స్ తనలో ఉండేవి అని చెప్పుకొచ్చింది అనుష్క. కొత్త సినిమా కోసం సెట్స్‌లోకి అడుగుపెడుతున్నాను అంటే… ఇప్పటికీ కొన్ని రోజుల వరకు ఆ భయం తన వెంటే ఉంటుందని నవ్వుతూ చెప్పింది అనుష్క. అలాగే సినిమా పరిశ్రమలో జయాపజయాలు శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలి అని చెప్పింది.
సినిమా పరిశ్రమలో జయాపజయాలు ఓ చక్రంలా తిరుగుతూనే ఉంటాయని, గెలుపోటములు రెండింటినీ సమంగా తీసుకోవడం అలవర్చుకోవాలి అని చిన్నసైజు వేదాంతం కూడా చెప్పింది. సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పని చేసినప్పుడే ముందుకువెళ్లగలం అని కూడా చెప్పింది. అలాగే ఇలాంటి కథలే చేయాలి, ఇలాంటి పాత్రలే చేయాలని ఎప్పుడూ అనుకోలేదని, ఎలాంటి పాత్ర వచ్చినా, నచ్చితే చేసేస్తానని చెప్పింది (Anushka) అనుష్క.