జేమ్స్ కెమెరూన్ సినిమా పరిశ్రమకు ఇచ్చిన అద్భుతం ‘అవతార్’. సినిమా విడుదలైన రోజు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన ఎంతో…. ఇప్పటికీ అదే రేంజిలో ప్రేక్షకులు ఆ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సినిమా రీ రిలీజ్‌లోనూ రికార్డులు కొడుతుండటమే దీనికి ఉదాహరణ. అవును ‘అవతార్’ను ఇటీవల చైనాలో రీ రిలీజ్ చేశారు. రావడం, రావడమే సినిమా రికార్డులు కొడుతోంది. ఈ క్రమంలో ‘అవెంజన్స్’ను దాటేసింది. చైనాలో రీ-రిలీజ్ అయిన ‘అవతార్’కు శుక్రవారం ఒక్కరోజే రూ.25.44 కోట్ల కలెక్షన్లు వచ్చాయట.
దీంతో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ దాటుకొని మరోసారి ఆ జాబితాలో అగ్రస్థానానికి ‘అవతార్’ చేరుకుంది. దీంతో బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘అవతార్’ మరోసారి నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.20.33 వేల కోట్లు వసూలు చేసింది. ఇంకా వసూళ్లు కొనసాగుతున్నాయి. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ విడుదలకు ముందు ఈ రికార్డు ‘అవతార్’ పేరిటే ఉండేది. ఆ చిత్రాన్ని రెండుసార్లు విడుదల చేయడంతో ‘అవతార్’ను అధిగమించింది. తాజాగా చైనాలో శుక్రవారం వచ్చిన కలెక్షన్లతో ‘అవతార్ ’మళ్లీ అగ్రస్థానానికి వచ్చేసింది.
‘అవతార్’ 2009లో రాగా, అవెంజర్స్: ఎండ్‌గేమ్’ 2019లో వచ్చింది. తొలి ‘అవతార్’ రికార్డులు కొడుతున్న ఈ సమయంలో దర్శకుడు జేమ్స్ కెమెరూన్.. ‘అవతార్’కు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు. 2022 డిసెంబరులో రెండో ‘అవతార్’ వస్తుంది.