నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తా! అని అంటుంటాడు పవన్ కల్యాణ్. అయితే చిరంజీవి కూడా దాదాపు ఇలానే ఉంటారు. ఆయన ఎన్నో ట్రెండ్‌లు సెట్ చేసి ఎందరికో దారి చూపించారు. అయితే ఇప్పుడు ‘భోళా శంకర్’ కోసం ఆయన ట్రెండ్‌ను సెట్ చేయడానికి.. ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మూడు ప్రచార వీడియోలు వచ్చాయి. ఒకటి టీజర్ అయితే.. రెండు పాటలు. వాటి బట్టి మనకు అర్థమయ్యేది ఈ సినిమా తెలంగాణ యాసలో సాగుతుంది అని.
అయితే ఏదో స్లాంగ్ వరకే చిరు తీసుకుంటున్నారు ఏమో అని అనుకుంటే.. అదొక్కటే కాదు సాంగ్ కూడా తీసుకున్నారు. రీసెంట్‌గా టీమ్ రిలీజ్ చేసిన ‘జాం జాం జజ్జనక..’ అనే పాటలో కూడా తెలంగాణ స్లాంగ్‌ను బాగా కలిపేశారు. తెలంగాణ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన ‘నర్సపెల్లే గండిలోన గంగధారి..’ అనే పాటను మధ్యలో పెట్టేశారు. ఈ పాట యూట్యూబ్‌లో ఎంత ఫేమసో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 300 మిలియన్లకుపైగా వ్యూస్ తెచ్చుకున్న పాట ఇది.
కనకవ్వ, మంగ్లీల ఫేమస్ పాటను ఈ సినిమాలో పెట్టడం ద్వారా ఇక్కడి జనాలను బాగా అట్రాక్ట్ చేయొచ్చని అనుకుంటున్నారని టాక్. మొన్నటికి మొన్న ‘ధమాకా’లో పల్సర్ బండి సాంగ్‌ను ఇలానే పెట్టి మంచి బజ్ సంపాదించిన విషయం చూశాం. అయితే సినిమాలో స్లాంగ్, సాంగ్ మాత్రమే కాకుండా తెలంగాణ వాసన మరింత గుభాళించే సన్నివేశాలు, స్టఫ్ ఉన్నాయని కూడా అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. పూర్తి క్లారిటీ అయితే ఆగస్టు 11న ఇస్తున్నారు. ఎందుకంటే ఆ రోజే ‘భోళా’ ఎంట్రీ ఇచ్చేది.
‘జాం జా జజ్జనక..’ పాటలో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు డ్యాన్సులేశారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ సెలెబ్రేషన్ సాంగ్ మాస్ బాగా నచ్చేలా ఉంది. ఈ పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజీ మీద ఒరిజినల్ సింగర్స్‌తో పాడిస్తారని సమాచారం.