మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 12 ఏళ్ళ తరువాత చిరంజీవి చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండడం మరో విశేషం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుండీ ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఇప్పటికీ హీరోయిన్ సమస్య ఓ కొలిక్కి రాలేదు.
త్రిష ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాక కాజల్ ను ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు నిర్మాతలు. చరణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర చెయ్యాల్సి ఉంది.. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల అది కూడా కుదిరేలా లేదని వినికిడి. షూటింగ్ 40 శాతం పూర్తయిన వెంటనే ఓ మహమ్మారి వచ్చి బ్రేక్ పడేలా చేసింది. 2 నెలల వరకూ షూటింగ్ నిలిచి పోయింది. తిరిగి షూటింగ్ ప్రారంభించాలి అని మెగాస్టార్ కొందరు నిర్మాతలతో ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.
దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో.. త్వరలో షూటింగ్ ప్రారంభించాలని సింహాచలం గుడి సెట్ ను వేసారట. కానీ గత రెండు రోజుల నుండీ భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ సెట్ మొత్తం నాశనం అయిపోయిందని సమాచారం. నిర్మాతలు చరణ్, నిరంజన్ రెడ్డి లకు భారీ నష్టం వాటిల్లింది అని తెలుస్తుంది. ఇలా ‘ఆచార్య’ చిత్రానికి ఏదో ఒక రకంగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది.