సినిమా మొత్తం ఓ 20 మంది నటీనటులు, ఒక్కొక్కరికీ ఒక్కో కథ, కథలో బోలెడన్ని ట్విస్టులు, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్, క్లైమాక్స్ లో భారీ ఫైట్. ఇలాంటి ప్యాకేజ్డ్ కమర్షియల్ సినిమాలు చూసీ చూసీ ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేసింది. అందుకే చిన్న కథా చిత్రాలవైపు మొగ్గుచూపుతున్నారు. అలా హిందీలో తాజా చిత్రమే “బ్లాక్ మెయిల్”. కంటెంట్ ఎడల్ట్ అయినా అందరినీ అలరించే విధంగా సినిమా తెరకెక్కడంతో థియేటర్ లో జనాలందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
భార్య తన ప్రియుడితో పెళ్ళైన తర్వాత కూడా రంకు కొనసాగిస్తుందని తెలిసిన భర్త.. ఆమెను చంపడమో లేక రంకు కొనసాగిస్తున్న ప్రియుడినో హతమార్చకుండా.. తన ఆర్ధిక పరిస్థితిలో బెటర్ మెంట్ కోసం ఆ ప్రియుడ్ని బ్లాక్ మెయిల్ చేయాలనుకొంటాడు. అలా మొదలైన ఈ బ్లాక్ మెయిల్ సంరంభం మలుపులు తీసుకుంటుంది. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న విడుదలై అందర్నీ విశేషంగా ఆకట్టుకొంటుంది. నిన్న విడుదలైన మరో చిత్రమైన “మిస్సింగ్”లో భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ కథనం పెద్దగా బాగోలేకపోవడంతో ఆ సినిమాని జనాలు ఆదరించలేదు. దాంతో బాలీవుడ్ లో ఈవారం “బ్లాక్ మెయిల్”కే భారీ విజయం దక్కేలా ఉంది.