‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, చరణ్ అభిమానులే కాకుండా దేశవిదేశాల్లోని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరోపక్క ప్రమోషన్లలో భాగంగా హీరోలిద్దరినీ రాజమౌళి నలిపేస్తున్నాడు. సౌత్ లోని అన్ని భాషలతో పాటు నార్త్ లో కూడా హీరోలని తెగ తిప్పేస్తున్నాడు. ‘బాహుబలి’ డైరెక్టర్ అనే బ్రాండ్ తో అక్కడ రాజమౌళి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.
ఆయన ఎక్కడకి వెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరో నిన్న అక్కడ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం రాజమౌళి,ఎన్టీఆర్, చరణ్ లు జైపూర్ లో ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ అక్కడ బుకింగ్స్ మాత్రం డల్ గా ఉన్నట్టు స్పష్టమవుతుంది. అవును నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్ లు కొంచెం డల్ గా సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో అయితే లేవు.
రేపు లేదా ఎల్లుండి బుకింగ్స్ ఊపందుకోవచ్చు అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.అలా జరగకపోతే రిలీజ్ రోజు నాడు టాక్ ను బట్టి అయినా బుకింగ్స్ జోరు పెరగొచ్చు.అలియా భట్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ మూవీలో నటించారు కాబట్టి.. అదొక ప్లస్ పాయింట్ గా భావించొచ్చు. అయితే మరోపక్క ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ రోజురోజుకి భారీ ఓపెనింగ్స్ తో దూసుకుపోతుండడం కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ స్లో బుకింగ్స్ కు కారణం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.