కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో స్టార్లంతా తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో డబ్బు చెల్లించి సినిమా హక్కులను తీసుకుంటున్నారు. కోవిడ్ టైమ్ లో అమెజాన్ భారీ మొత్తం చెల్లించి కొన్ని సినిమా ‘వి’. నాని నటించిన ఈ సినిమా కోసం ముప్పై కోట్లకు పైగానే వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అంతకుమించి వెచ్చించి కొన్న సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ఈ సినిమా అన్ని భాషలకు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ.42 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవాళ్లకు ఈ సినిమా పైసా వసూల్ అనుకోవాలి. అయితే ఈ సినిమా కారణంగా ప్రైమ్ కి ఎంతమంది కొత్త సభ్యులు యాడ్ అవుతారు..? ఎన్ని రెన్యువల్స్ ఉంటాయనేది కీలకం. అయితే ఈ లెక్కలను అమెజాన్ సంస్థ బయటకి చెప్పదు. ఇదిలా ఉండగా.. సూర్య ఈ సినిమాలో నటించడంతో పాటు స్వయంగా నిర్మించారు. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులే కాకుండా అన్ని భాషల్లో శాటిలైట్, హిందీ రీమేక్ ఇలాంటి ఇతర హక్కుల ద్వారా కూడా సూర్య కొంతమొత్తాన్ని వసూలు చేయనున్నారు. ఎలా చూసుకున్నా మొత్తం మార్కెట్ రూ.65 నుండి రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతగా ఈ సినిమా సూర్యకి లాభాలు తీసుకొచ్చిందని టాక్. మరోపక్క అమెజాన్ కి కూడా ఈ సినిమా కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రైమ్ లో రిలీజ్ చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రీసెంట్ గా విడుదలైన ‘మిస్ ఇండియా’ గురించి కూడా మాట్లాడుకోకపోవడం బెటర్. ఇలాంటి సమయంలో ప్రైమ్ లో ‘ఆకాశం నీ హద్దురా’ విడుదల కావడం, పాజిటివ్ రివ్యూలు వస్తుండడంతో ఈ సినిమా అమెజాన్ కు గేమ్ ఛేంజర్ గా మారింది.