గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. జూలై 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నెల రోజుల ముందు నుండే చిత్ర బృందం ప్రమోషన్లు మొదలుపెట్టింది. టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ గారు సమర్పకులు గా వ్యవహరించారు. నిన్న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకని కూడా నిర్వహించారు.
ఈ వేడుకకి చిరంజీవి గెస్ట్ గా వచ్చి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన ఒకసారి మైక్ పట్టుకుంటే కనీసం పావుగంట మాట్లాడతారు అన్న సంగతి తెలిసిందే. నిన్న కూడా ఆయన దాదాపు 17 నిమిషాల వరకు మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన రావు రమేష్ గురించి మాట్లాడుతూ ఆయన తండ్రి రావు గోపాల్ రావు గారిని ఇమిటేట్ చేసి అలరించారు. అలాగే మారుతి, బన్నీ వాస్ ల గురించి కూడా గొప్పగా చెప్పారు.
ఇదే క్రమంలో గోపీచంద్ గురించి మాట్లాడిన చిరు.. అతని తండ్రి టి.కృష్ణ గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చారు. గోపీచంద్ విలక్షణమైన పాత్రలు చేసి హీరోగా మారి మంచి మంచి హిట్లు కొడుతున్నాడు అన్నట్టు చెప్పుకొచ్చిన చిరు.. ఇదే క్రమంలో గోపీచంద్ నటించిన సినిమాల్లో తనకి ‘సాహసం’ ‘ఒక్కడున్నాడు’ ‘చాణక్య’ వంటి సినిమాలు ఇష్టమని చెప్పారు. నిజానికి ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలే. అయితే ‘సాహసం’ ‘ఒక్కడున్నాడు’ సినిమాలను ఇష్టపడేవాళ్లు ఉన్నారు లెండి.
అయితే ‘చాణక్య’ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో అనే విషయం చాలా మందికి తెలీదు. అలాంటి సినిమా ఇష్టమని చిరు చెప్పడం విడ్డూరంగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గోపీచంద్ కెరీర్లో హిట్టు సినిమాలు ఉన్నాయి. ‘యజ్ఞం’ ‘రణం’ ‘లక్ష్యం’ ‘శౌర్యం’ ‘లౌక్యం’ ‘సీటీమార్’ వంటి సినిమాలు గోపీచంద్ కు మంచి సక్సెస్ అందించాయి. ‘ఇవేమి చిరుకి గుర్తులేవనుకుంట నోటికొచ్చిన ప్లాప్ సినిమాల పేర్లని చెప్పి పడేశారు’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.