కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ‘తుపాకీ’ నుండి విజయ్ సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకుంటున్నాయి. ‘జిల్లా’ ‘పోలీస్’ ‘అదిరింది’ ‘సర్కార్ ‘ ‘విజిల్’ ‘మాస్టర్’ ‘వారసుడు’ వంటి సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. ఇక్కడ మంచి కలెక్షన్స్ కూడా సాధించాయి. ప్లాప్ అయినప్పటికీ ‘బీస్ట్ సినిమా బాగానే కలెక్ట్ చేసింది. త్వరలో రాబోతున్న ‘లియో’ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ గురించి ఎక్కువమందికి తెలిసుండదు. కానీ ఒకప్పుడు ఈయన తెలుగులో పలు క్రేజీ ప్రాజెక్టులకి దర్శకత్వం వహించారు. అవును ఈయన తెలుగులో సినిమాలు తీసినట్టు చాలా మందికి తెలీదు.
మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) కూడా ఎస్.ఎ.చంద్రశేఖర్ పలు సినిమాలు తెరకెక్కించారు. అవేంటి అంటే :
1 ) దేవాంతకుడు : చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.ఎ.చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 12 1984 లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది.
2 ) పల్లెటూరి మొనగాడు : చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రానికి కూడా ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి 5 1983 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది యావరేజ్ గా ఆడింది.
3 ) చట్టానికి కళ్లులేవు : చిరంజీవి, మాధవి జంటగా నటించిన ఈ చిత్రానికి కూడా ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకుడు. 1981 అక్టోబర్ 30 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఎస్.ఎ.చంద్రశేఖర్ ఇంకా తెలుగులో ‘బలిదానం’ ‘దోపిడీ దొంగలు’ ‘ఇంటికో రుద్రమ్మ’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు. అవి కూడా బాగానే ఆడాయి. అయితే ఎందుకో ఇతను విజయ్ ని తెలుగులో లాంచ్ చేయలేదు. ఒకవేళ ఎప్పుడో లాంచ్ అయితే తెలుగులో రజినీకాంత్ రేంజ్ కి విజయ్ వెళ్ళుండేవాడేమో.