సినిమాలకు, రాజకీయాలకూ ఉన్న అవినాభావ సంబంధం ఇప్పటిది కాదు. తమిళనాట ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత, తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యణ్.. ఇలా నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. రామా నాయుడు, మురళీ మోహన్, అశ్వినీ దత్ వంటి నిర్మాతలు ఎందరో ఉన్నారు. ఆ మధ్య కాలంలో కామెడీ కింగ్ అలీ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అయిన వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు. తన చిరకాల మిత్రుడు పవన్ కళ్యాణ్‌తోనూ రాజకీయంగా విబేధించారాయన. ఎంతసేపూ సినిమాలు, కుటుంబమే ముఖ్యం అనుకునే ఆలీ పాలిటిక్స్‌లోకి రావడం అనేది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ మధ్య నిర్మాతగా మారడంతో పాటు, కుమార్తె పెళ్లి పనులతో బిజీగా ఉంటున్నారు ఆలీ. అడపాదడపా ఏపీకి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆలీ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆయనకి కీలక పదవి ఇచ్చారు. అధికార ప్రభుత్వం ఆయనకు సలహాదారు పదవికి ఎంపిక చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఆలీ నియామకమయ్యారు. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని తెలిాపారు.
మీడియా సలహాదారుడిగా సినీ రంగానికి చెందిన వ్యక్తిని ఎంపిక చెయ్యడం మంచి పరిణామమని, ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.. పరిశ్రమలో అజాత శత్రువుగా పేరొందిన ఆలీ ఈ పదవికి సమర్థుడని.. ఇండస్ట్రీకి, మీడియాకి మధ్య వారధిలా ఆయన పనిచేస్తారంటూ పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆలీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆలీ ప్రధాన పాత్రలో నటిస్తూ.. ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్ స్థాపించారు.. డా. ఆలీ సమర్పణలో, కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో, ఆలీ బాబా, కొణతాల మోహన్, శ్రీ చరణ్ కలిసి నిర్మించిన పక్కా కామెడీ మూవీ..
‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’.. మౌర్యానీ హీరోయిన్. ‘యమలీల’ లో ఆలీ తల్లిగా నటించిన పాపులర్ క్లాసికల్ డ్యాన్సర్, సీనియర్ నటి మంజు భార్గవి కీలకపాత్రలో నటించారు. వీకే నరేష్, పవిత్రా లోకేష్, భద్రం, ఎల్.బి.శ్రీరామ్, తనికెళ్ల భరణి తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ అక్టోబర్ 28 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.