“రంగస్థలం” ఆల్బమ్ మొత్తానికి అందరికీ నచ్చిన, అందరూ మెచ్చిన పాట “రంగమ్మా మంగమ్మ”. దేవిశ్రీప్రసాద్ నేతృత్వంలో మానసి పాడిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంది. ముఖ్యంగా ఈ పాటలో సమంత స్టిల్స్ వైరల్ అయిపోయాయి. ఇంతలా హిట్ అయిన ఈ పాట చుట్టూ ఇప్పుడు గొడవలు చుట్టుముడుతున్నాయి. ఈ పాటలోని “గొల్లభామ వచ్చి..” అనే పల్లవి తమ ఆడపడుచుల గౌరవాన్ని కించపరిచేలా ఉందని రాములు యాదవ్ అనే యాదవ హక్కుల పోరాట సమితికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
అర్జెంట్ గా సదరు “గొల్లభామ వచ్చి..” అనే పల్లవిని పాట నుంచి తొలగించకపోతే తమ సమితి గొడవలకు దిగుతుందని పేర్కొంటున్న ఈ యువకుడు అవసరమైతే ధర్నాకి కూడా దిగుతానంటున్నాడు. అయినా.. పాట విడుదలైన వారం రోజుల తర్వాత ఇప్పుడు ఈ రాములు వచ్చి గొడవ చేయడం ఎంటనేది అర్ధం కాని విషయం. అయితే.. ఈ తరహా గొడవలు పెద్ద సినిమాల రిలీజ్ టైమ్ లో జరగడం అనేది సర్వసాధారణం. గతంలో “మగధీర” టైమ్ లో కూడా వంగపండు ప్రసాదరావు తన పాటను వాడారంటూ రోడ్డుకెక్కాడు.