రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కథ తనదని రచయిత్రి శ్యామలారాణి దిల్ రాజుపై ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు అతనిపై సెక్షన్ 120ఏ, 415, 420 కాపీరైట్ యాక్ట్ కింద దిల్‌రాజుపై కేసు నమోదుచేశారు. ఈ విషయం ఫిలిం నగర్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇది నిజమేనా? దిల్ రాజు ఇలా చేశారా? అని చిత్ర యూనిట్ ని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. దీంతో చిత్ర డైరక్టర్ కాపీ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు. స్వయంగా రాసిన ఓ లేఖను సోషల్ మీడియాలో ఉంచారు. “మిస్టర్ పర్ఫెక్ట్” కాపీ కథ కాదని స్పష్టం చేశారు. “శ్యామలారాణి తన నవల ” నా మనసు నిన్ను కోరి ” ని 2010 ఆగస్టులో రిలీజ్ చేశారు. కానీ అంతకుముందే 2009 లో ఈ మూవీ కథను ” నవ్వుతూ ” అనే టైటిల్ తో రైటర్స్ యూనియన్ లో రిజిస్టర్ చేయించాము.
ఈ విషయాన్ని యూనియన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ శ్యామలారాణికి తెలియజేశారు., అయినా ఆమె అర్థం చేసుకోలేదు” అని ఆనాటి సంగతిని ఆధారాలతో సహా వివరించారు. అంతేకాదు.. 2008 లోనే ఈ కథను హీరో ప్రభాస్ కి తాము చెప్పగా, అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని లేఖలో స్పష్టం చేశారు. ఇంతటితోనైనా ఈ వివాదం ముగుస్తుందని డైరక్టర్ ఆశిస్తున్నారు.