‘సినిమాటిక్ యూనివర్స్’.. ఇప్పుడు ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ ఇదే. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ నడుస్తున్నా ‘కల్కి (Kalki 2898 AD) సినిమాటిక్ యూనివర్స్’ అని నాగ్ అశ్విన్ (Nag Ashwin) కొత్తగా తీసుకురావడంతో మరోసారి ఆ చర్చ మొదలైంది. ఈ క్రమంలో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ (Shankar) చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ‘అలా చేసుంటే మొదటి సినిమాటిక్ నేనే చేసేవాణ్ని’ అని కామెంట్ చేశారాయన. హాలీవుడ్‌లో మొదలైన ‘సినిమాటిక్ యూనివర్స్’ ఇప్పుడు మన దేశంలోకి కూడా వచ్చింది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా అన్నీ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఈ విషయం గురించి శంకర్ మాట్లాడుతూ ‘రోబో’ (Robo 2.0) సినిమా చిత్రీకరణ సమయంలోనే సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన వచ్చిందని.. ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘శివాజీ’ (Sivaji) సినిమాల్లోని హీరోల పాత్రలను కలుపుతూ ఓ ప్రాజెక్టు చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. ఆలోచన రాగానే అసిస్టెంట్ డైరెక్టర్లను పిలిచి ఆ విషయం చెప్పారట శంకర్. అయితే వాళ్లందరూ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వారట.
ఆ ఆలోచన వారికి అంతగా నచ్చలేదని అర్థం చేసుకున్నారట. ఆ తర్వాత కొన్ని రోజులకు కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా చెప్పారట. వారి నుండి కూడా సరైన స్పందన రాలేదట. అలా ఎటువైపు నుండి సపోర్ట్ రాకపోవడతో ‘సినిమాటిక్ యూనివర్స్’ ఆలోచనే కరెక్ట్ కాదేమోనని ఊరుకున్నానని శంకర్ చెప్పారు. అయితే అక్కడకు కొన్నాళ్లకు హాలీవుడ్‌లో ‘అవెంజర్స్’ నుండి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వచ్చింది. అది చూశాక మీరైనా భవిష్యత్తులో కొత్త తరహా కాన్సెప్ట్‌లతో సినిమా తీయాలనిపిస్తే వెంటనే తీసేయండి.
లేదంటే ప్రపంచంలో ఎవరో ఒకరు తీసేస్తారు అని అన్నారట శంకర్. ఒకవేళ తాను అనుకున్నది అనుకున్నట్లు చేసి ఉంటే ‘శంకర్ సినిమాటిక్ యూనివర్స్’ మన దేశంలో తొలి సినిమాటిక్ యూనివర్స్ అయి ఉండేది అని శంకర్ చెప్పారు. ఎందుకంటే ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘శివాజీ’ సినిమాలు, అందులోని కథానాయకుల పాత్రలు ప్రేక్షకులపై చాలా ఎక్కువ ప్రభావం చూపించిన విషయం తెలిసిందే.