టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సెలబ్రెటీ కరోనా బారినపడ్డారు. మెగా బ్రదర్ నాగబాబు వైరస్ బారిన పడ్డానని తెలియజేసిన మరికొన్ని గంటలకే సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సైతం తాను కొవిడ్-19 పాజిటివ్ అని తెలియజేశారు. దాంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా 65 సంవత్సరాల సింగీతం శ్రీనివాసరావు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా ప్రజలకు చెప్పారు. సెప్టెంబర్ 21న సింగీతం పుట్టినరోజు.
ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తి కావడంతో ఆ రోజున స్పెషల్ ప్రోగ్రాములు చేయడానికి మీడియా సన్నాహాలు చేస్తోంది. ఆ కార్యక్రమాల లో పార్టిసిపేట్ చేస్తారేమోనని సింగీతం శ్రీనివాస రావు ని కాంటాక్ట్ చెయ్యడానికి ప్రయత్నించింది. ప్రెస్ పీపుల్ నుండి ఫోన్లు వస్తుండడంతో ఆయన అసలు విషయం చెప్పారు. “సెప్టెంబర్ 9న నాకు కరోనా వచ్చిందని డాక్టర్ డిక్లేర్ చేశారు. నేను కొవిడ్-19 పాజిటివ్ అని చెప్పారు” అని సింగీతం శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
65 ఏళ్లుగా తాను పాజిటివ్ గా వున్నట్టు ఆ డాక్టర్ తో చెప్పానని చాలా సరదాగా నవ్వుతూ ఆయన వీడియో లో వెల్లడించారు. ప్రస్తుతం సింగీతం శ్రీనివాసరావు హోమ్ ఐసోలేషన్ లో వున్నారు. కుటుంబ సభ్యులను కలవకుండా ప్రత్యేకంగా ఒక గది లో ఉండటంతో పాటు బాత్రూం సైతం సపరేట్ గా వుంచారట. ఈ నెల 23 వ తారీకు వరకు ఐసోలేషన్ లో వుండాలని సింగీతం శ్రీనివాసరావు వివరించారు. ఈ వీడియో చూస్తుంటే సంపూర్ణ ఆరోగ్యంతో వున్నట్లే అని కనబడుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.