టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ లో నల్లగా చూపించారు. సిరీస్ మొత్తం కూడా ఆమె అలానే కనిపిస్తుంది. ఆమె ముఖానికి నల్లటి మేకప్ వేశారు. కావాలనే ఆమెను అందవిహీనంగా చూపించారంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన దర్శకుడు రాజ్, డీకే.. ఈలంకు చెందిన ఓ యోధురాలు ఎలా ఉండాలో అలానే సమంత కనిపించిందని.. రాజీ పాత్రను అందంగా చూపించడం అసలు కరెక్ట్ కాదని అంటున్నారు ఈ దర్శకుడు.
ఆ పాత్ర అలాంటిదని.. అమ్మాయి నల్లగా ఉందా..? లేక అందంగా ఉందా..? అని లెక్కలేసే పాత్ర కాదని.. రాజీ ఓ సైనికురాలు.. ఓ పోరాట యోధురాలని అన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో అణచివేతకు గురైన ఓ మహిళ అలానే కనిపించాలని చెప్పారు. గతంలో ఎన్నో లేడీ క్యారెక్టర్స్ అందంగా ఫైట్ చేసి ఉండొచ్చు కానీ రాజీ అలాంటి పాత్ర కాదని అన్నారు. సమంతను కళావిహీనంగా చూపించాలనేది తమ ఆలోచన కాదని.. అదంతా పాత్రలో భాగమని అన్నారు.
ఈ పాత్ర కోసం సమంత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందని.. ఆమె ధరించిన బట్టలు కూడా పాత్రకు అనుగుణంగా ఉన్నాయని.. ఇదంతా పాత్రకు అవసరమని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా రాజీ పాత్రలో సమంత పెర్ఫార్మన్స్ కి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. భవిష్యత్తులో ఆమెని మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ లో చూడాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.