పేరున్న నటీనటుల వారసులు తెరపైకి రావడం కొత్తేమీ కాదు. వారి అండదండలతో తొలి సినిమా ఫలితం కాస్త అటుఇటైనా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అలాంటి వారసులకు మరికొందరు ‘స్టార్’లు తోడైతే ఇంక వారు ధీమాగా ఉండొచ్చు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. నాగార్జున కీలక పాత్రలో నటిస్తూ నిర్మించిన ఈ సినిమా రోషన్ కి శుభారంభమే.
అయినా రెండో సినిమా రెండేళ్ల తర్వాతే అంటున్నారు రోషన్ తల్లిదండ్రులు. తనయుడి అరంగేట్రాన్ని పురస్కరించుకుని పాత్రికేయులతో ముచ్చటించిన శ్రీకాంత్ తన తనయుడి గురించి ఈ రకంగా చెప్పుకొచ్చారు. ముందునుండి రోషన్ ని క్రికెటర్ చేయాలనుకున్నారట. అందుకోసం రోషన్ ఐదో తరగతి నుండి శిక్షణ ఇప్పించారట. రాష్ట్ర స్థాయి ఆడే సమయానికి ‘రుద్రమదేవి’ లో అవకాశం వచ్చింది. తర్వాత రోషన్ నటనపై ఆసక్తి కనబరిచాడు. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసిన శ్రీకాంత్ తన కొడుకు తనకంటే గొప్పవాడు అవుతాడని ఆకాక్షించారు.
ఇప్పుడు ‘నిర్మలా కాన్వెంట్’ చేసినా తర్వాతి సినిమా మాత్రం రెండేళ్ల తర్వాతే ఉంటుందని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈలోపు నటనలో మరింత నైపుణ్యం సాధించాలని, ముఖ్యంగా డాన్స్, ఫైట్స్ ల్లో శిక్షణ తీసుకుంటాడని తెలిపారు. ఆ లెక్కన రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయి హీరోగా రోషన్ రీలాంచ్ అవుతాడన్నమాట.