‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపేశాడు?’.. ఈ పాయింట్ పట్టుకునే ‘బాహుబలి 1’ నుండి ‘బాహుబలి 2’ వరకు ప్రేక్షకుల్ని తీసుకొచ్చారు దర్శకుడు రాజమౌళి. ఎందుకు చంపాడు అనే మాటను స్లోగన్‌లా, మంత్రంలా సినిమా ప్రేక్షకులు పఠించారు కూడా. అందుకే రెండో ‘బాహుబలి’ అంత భారీ విజయం అందుకుంది. ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ ఈ పాయింట్ ఆధారంగానే రాసుకున్నారట. అంటే ఈ సీన్ ముందు రెడీ చేసి.. ఆ తర్వాత మిగిలిన కథ వచ్చిందట.
‘బాహుబలి’ సినిమా కథ ఎలా పుట్టింది, దానికి ఆ తర్వాత ఏ రూపం వచ్చింది అనేది ఇటీవల విజయేంద్ర ప్రసాద్ వివరించారు. అయితే విజయేంద్రప్రసాద్ తొలుత రాజమౌళికి చెప్పిన ఈ సీన్ సినిమాలో లేదు. కేవలం కీలక విషయం మాత్రమే సినిమాలో ఉందట. సినిమాలో చూసిందానికి కొంచెం భిన్నంగా లైన్ రాజమౌళికి చెబితే.. అక్కడి నుండి కథా విస్తరణ చేసినట్లు విజయేంద్ర ప్రసాద్ వివరించారు. ఆ లైన్, ఇప్పుడు సినిమాలో ఉన్న లైన్ రెండూ కట్టప్ప పాత్రకే రిలేటెడ్ కావడం గమనార్హం.
‘బాహుబలి: ది బిగినింగ్’లో సత్యరాజ్ – సుదీప్ మధ్య వచ్చే సన్నివేశం గుర్తుందా. ఇద్దరి మధ్య కత్తి ఫైట్ కూడా జరుగుతుంది. సినిమా అక్కడి నుండే మొదలవ్వాలి. ఆ సీన్‌నే రాజమౌళికి విజయేంద్రప్రసాద్ చెప్పారట. కానీ అప్పుడు అనుకున్న సన్నివేశం వేరట. విదేశాల నుండి ఆయుధాలు ఒక వర్తకుడు మాహిష్మతి సామ్రాజ్యానికి వస్తాడు. ఆ సమయంలో 80 ఏళ్ల వయసున్న పెద్దాయన పిల్లలకు కత్తి యుద్ధం నేర్పిస్తుంటాడు. అది చూసి మీరు గొప్ప వీరుడిలా ఉన్నాడే అని మాట కలిపితే..
మీకు బాహుబలి గురించి తెలియదా? అని అడుగుతాడట. ఎవరాయన అని ప్రశ్నిస్తే తామిద్దరం కలిసి చాలా ఏళ్లు సాధన చేశాం. యుద్ధాలు చేశాం అని వివరిస్తాడట. అలా ఓసారి అడవిలో వెళ్తుండగా 200 మంది ఒకేసారి వచ్చి దాడి చేస్తారు. వాళ్లతో అతను యుద్ధం చేస్తుంటే మహాభారతంలో అర్జునుడు ఇలాగే యుద్ధం చేశాడేమో అనిపించింది. యుద్ధం పూర్తయ్యే సరికి రక్తంలో తడిసి ముద్దయ్యాడు. కానీ ఆ ఒంటి మీద ఉన్న ఒక్క రక్తపు చుక్క కూడా అతడిది కాదు.
ఎందుకంటే ఒంటి మీద గాటు పెట్టగల వీరుడు ఇంకా పుట్టలేదు అని ఆ ముసలాయన వర్తకుడికి వివరిస్తాడు. అంతటి వీరుడిని ఒకసారి చూడాలి అని ఆ వర్తకుడు అడిగితే… అతను చనిపోయాడు అంటాడు. మరి అతణ్ని ఎవరూ తాకలేరు అన్నావు కదా అంటే నేనే వెన్నుపోటు పొడిచా.. అని చెప్పాడట పెద్దాయన. ఆ తర్వాత సినిమా కథ ముందుకెళ్లేలా ప్లాట్ చెప్పారట విజయేంద్ర ప్రసాద్.