కరోనా రెండో షో కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సినిమాలు వాయిదా పక్కా అని మొన్నే చెప్పుకున్నాం. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ రోజు నాని ‘టక్ జగదీష్’ సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ‘టక్ జగదీష్’ వాయిదాకు కరోనా ఒక్కటే కారణం కాదని పుకార్లు వినిపిస్తున్నాయి. నిజానిజాలు పక్కనపెడితే… అసలు ఆ కారణం ఏంటో చూద్దాం! ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన ‘టక్ జగదీష్’ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వాయిదా వేసుంటారులే అనేది కొంతమంది వాదన. ఇక్కడో మరో వాదన కూడా ఉంది. అదే ఏపీలో టికెట్ రేటు ధరలు, షోస్ విధానాలు. అవును సినిమా వాయిదాకు ఇది కూడా ఓ కారణమని టాక్. ‘వకీల్‌సాబ్’ రిలీజ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లుండి టికెట్ల ధరలపై నియంత్రణ తీసుకొచ్చారు. తొలి వారం టికెట్ల రేట్లు పెంపును అడ్డుకోవడంతోపాటు, పదేళ్ల క్రితం ధరల పట్టిక ముందుకు తెచ్చి, దాని ప్రకారమే టికెట్లు అమ్మాలని నిర్ణయించారు. అలా చేయకపోతే థియేటర్లను మూసి వేయిస్తారని వార్తలొస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఆలోచన మారిందట. ప్రభుత్వం చెప్పిన రేట్లతో థియేటర్లను నడపడం కష్టమని థియేటర్ యజమానులు చెబుతున్నారట. దీంతో ఈ సమయంలో సినిమా విడుదల చేసి సరైన వసూళ్లు లేక ఇబ్బంది పడటం ఎందుకు అని ‘టక్ జగదీష్’ టీమ్ సినిమా విడుదల వాయిదా వేసుకుందట. మరోవైపు 50 శాతం ఆక్యుపెన్సీ విధానం కూడా తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా వాయిదా వేయడం మంచిది అనుకున్నారట. చూస్తుంటే ఆ తర్వాతి వారాల్లో రావాల్సిన సినిమాలు కూడా అనుకున్న ప్రకారం విడుదలవ్వడం కష్టంగానే ఉంది.