కొన్ని సినిమాలు విడుదలయ్యాక అసలు ఆ హీరో ఈ సినిమా ఎందుకు చేశాడ్రా బాబు అని సగటు ప్రేక్షకులు మాత్రమే కాక హీరో అభిమానులు కూడా తమని తాము ప్రశ్నించుకొంటుంటారు. ఇదివరకంటే.. వారాంతంలో సినిమా తప్ప వేరే ఎంటర్ టైన్మెంట్ ఉండేది కాదు కాబట్టి ఫ్లాప్ సినిమాకి కూడా కనీస స్థాయి వసూళ్లు వచ్చేవి. కానీ.. ఈమధ్యకాలంలో డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ అందుబాటులోకి వచ్చాక సినిమాలో మినిమం కంటెంట్ లేకపోతే జనాలు ఆదరించడం లేదు సరికదా కనీసం థియేటర్ల వైపుకు కూడా రావడం లేదు. అందుకు తాజా నిదర్శనం “నేల టికెట్టు” చిత్రం.
రవితేజ లాంటి మాస్ హీరో నటించిన ఈ చిత్రానికి కనీస స్థాయి కలెక్షన్స్ కాదు కదా ఓపెనింగ్స్ కూడా లేవు. అసలు కథే లేదు అది వేరే విషయం అనుకోండి. మరి రవితేజ ఈ సినిమా ఎందుకు చేశాడు అని అడిగితే మాత్రం “12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కోసం” అంటున్నారు ఫిలిమ్ నగర్ వర్గాలు. ఆ రెమ్యూనరేషన్ కోసం కనీసం కథ కూడా పూర్తిగా వినకుండా షూటింగ్ మొదలెట్టేశాడట.
అయితే.. మరీ డబ్బుల కోసం సినిమాలు చేయాల్సిన పొజిషన్ లో రవితేజ లేడు. ముఖ్యంగా ఆయనకంటే సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు కూడా కంటెంట్ కు ప్రాధాన్యత ఇస్తుంటే.. రవితేజ మాత్రం ఇలా డబ్బుల కోసం సినిమా చేయడం అనేది ఎంతవరకూ సమంజసం అనే విషయాన్ని ఆయన డిసైడ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది.