దేశం మొత్తం మన సినిమా కోసం ఎదురుచూస్తోంది. ప్రపంచంలో ఉన్న హిందువులు మన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అంటూ.. కొన్ని రోజులుపాటు ప్రచారం చేసి సినిమాను విడుదల చేశారు. అందరికీ అందుబాటులో సినిమా అంటూ కొంతమంది సెలబ్రిటీలతో ఉచితంగా టికెట్లు ఇప్పించారు. అయితే ఇదంతా ఆ సినిమా చుట్టూ ముసురుతున్న వివాదాలను ఏ మాత్రం దూరం చేయలేకపోయాయి. మీరు అర్థమైపోయుంటుందిగా ఇదంతా ‘ఆదిపురుష్’ సినిమా కోసమే అని. వసూళ్లు అదిరిపోయాయ్ అంటూ దూసుకెళ్తున్న ‘ఆదిపురుష్’..
వివాదాల, చర్చలు, రచ్చలు కారణంగా ‘వివాదపురుష్’ అయిపోయింది.‘ఆదిపురుష్’ సినిమాను రోజురోజుకీ వివాదాలు కమ్మేస్తున్నాయి అనొచ్చు. కొన్ని సన్నివేశాలు, ఇంకొన్ని సంభాషణలు సినిమాను ఇబ్బంది పెడుతున్నాయి. సంభాషణలు మారుస్తున్నామని టీమ్ చెప్పినా శాంతించడం లేదు. సినిమాను పూర్తిగా నిషేధించాలంటూ కొన్ని రాష్ట్రాల్లో నిరసనల పెరుగుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో చూపించిన విషయాల కంటే… ప్రధాన పాత్రల రూపకల్పన, సంభాషణలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది టీజర్ విడుదలైన రోజే మొదలైంది.
తాజాగా ఈ నిరసనలు మరింత పెరిగాయి సోమవారం అయోధ్యలో కొందరు వీధుల్లోకి వచ్చి సినిమాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. థియేటర్ల ముందు ధర్నాకు దిగారు. మథురలో కొందరు ‘ఆదిపురుష్’ సినిమా పోస్టర్లను చింపేసి, థియేటర్ల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కొన్ని వివాదాస్పద సంభాషణలు, సన్నివేశాల వల్ల తమ మనోభావాలను దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకరంగా ఉన్న సినిమాను ఎలా ఆమోదించారు అంటూ సెన్సార్ బోర్డు మీద విరుచుకుపడ్డారు. ఇవే కాదు మన దేశంలో చాలా ప్రాంతాల్లో సినిమా విషయంలో వివాదాలు ఉన్నాయి.
తాజావి అయితే ఇవి. ఇక ‘ఆదిపురుష్’ (Adipurush) నిసరనలు పక్క దేశం నేపాల్‌కి పాకాయన్న సంగతి తెలిసిందే. ‘ఆదిపురుష్’ ప్రదర్శనని ఆ దేశవ్యాప్తంగా నిలిపివేశారు. ఖాట్మండ్, పోఖారాలోని థియేటర్లలో హిందీ చిత్రాలేవీ ప్రదర్శించకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో సీతను భారతీయ పుత్రిక అని చెప్పడంపై వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ దేశస్థుల మత విశ్వాసం ప్రకారం సీత ఈశాన్య నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించింది.