కమర్షియల్ సినిమా అంటే తెలుగులో ఒక ఫార్మేట్ సెట్ అయిపోయింది. ఆరు పాటలు ఆరు ఫైట్లు తప్పనిసరి. తెలుగు ప్రేక్షకులు అలా ఫిక్స్ అయిపోయారు. స్టార్ హీరోల సినిమాలు అయితే వారి అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాల్సి ఉంటుంది. కథలను మార్చితే ఫలితాలు తారుమారు అయిపోతాయి. అందుకే సాహసాలు చేయరు. కానీ త్రివిక్రమ్ మరోసారి ప్రయోగానికి సిద్ధమయ్యారు. గతంలో ఖలేజాలో మహేష్ బాబు తో కామెడీ పండించి నిర్మాతని, డిస్ట్రిబ్యూటర్ ని ఏడిపించారు. ఇప్పుడు అదే పొరబాటు చేస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తో అతను చేస్తున్న సినిమాలో నాలుగు పాటలు మాత్రమే పెట్టడం. అదికూడా కథకనుగుణమైన పాటలను కంపోజ్ చేయించడం జీర్ణించుకులేకపోతున్నారు.
ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీస్తారు.. అతని డాన్స్ కోసం థియేటర్ కి వచ్చే అభిమానులు ఉన్నారు. అటువంటి అప్పుడు కనీసం మూడు పాటలైనా డాన్స్ కి ప్రాధాన్యం ఉండే పాటలు ఉండాలి. అరవిందలో మాత్రం ఒకటే ఉంది. ఇదే అభిమానులకు నచ్చడం లేదు. రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ఆనందించిన వారు.. పాటలు విన్న తర్వాత సీమ మీద డాక్యుమెంటరీ తీస్తున్నారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ తన ఇమేజ్ కి భిన్నంగా కథలను ఎంచుకున్నప్పటి నుంచి విజయాలను అందుకుంటున్నారు. అందుకే ఈ సారి కూడా అభిమానుల గురించి ఆలోచించకుండా కొత్తదనానికి స్వాగతం పలికారు. కమర్షియల్ సినిమా రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు. మరి ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.