తమ సినిమా మీద ఊరికనే అవాకులు, చవాకులు పేలితే ఊరుకునేది లేదు అంటూ సినిమా నిర్మాణ సంస్థలు వార్నింగ్‌లు ఇస్తూ ఉంటాయి. అయినప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొంతమంది రివ్యూయర్లు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎందుకు అంటారు, ఎవరు అనిపిస్తారు, ఆ మాటల వెనుక మర్మమేంటి అనేది ఆ నిర్మాతలకు తెలుసు. ఆ సినిమా హీరో ఫ్యాన్స్‌కి కూడా తెలుసు. అయితే తెలుగు సినిమా మీద ఊరికనే నోరేసుకుపడిపోయే రివ్యూయర్ల ముసుగులో ఉన్న అక్కసుగాళ్ల మీద వైజయంతి మూవీస్ భారీ మొత్తంలో దావా వేసింది అని అంటున్నారు.
తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్‌లో వస్తోంది, విజయం సాధించేలా ఉంది, సాధించింది, అద్వితీయమైన వసూళ్లు వస్తున్నాయి అనగానే.. బాలీవుడ్‌లో కొంతమంది వ్యక్తులు గొంతేసుకుపడిపోతారు. అలాంటి వారి మీద ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది అని చెబుతున్నారు. సినిమా వసూళ్ల గురించి నిర్మాతలు చెబుతున్న వసూళ్ల ఫిగర్స్ సరికావు అంటూ కొందరు క్రిటిక్స్ కమ్ ట్రేడ్ అనలిస్ట్స్ గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
కలెక్షన్లు ఫేక్ అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో వరుస పోస్టులు పెడుతున్నారు. ఆ సినిమాను డీగ్రేడ్ చేసేందుకు ట్వీట్లు పెడుతూ డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా ఎఫెక్ట్ తీసుకొస్తున్నారు నెటిజన్లు కూడా వాళ్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బాలీవుడ్ అనలిస్ట్‌లు / ట్రేడ్ అనలిస్ట్‌ల మీద రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేసిందట వైజయంతి మూవీస్ సంస్థ.
వసూళ్ల గురించి చేసిన ట్వీట్లను ప్రస్తావిస్తూ ‘అవి నిజమని రుజువు చేయకపోతే రూ.25 కోట్లు కట్టాలి’ అని డిమాండ్ చేసిందట. ఈ నోటీసులపై ఆ ఇద్దరు క్రిటిక్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో అని మిగిలినవాళ్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ విషయం ఇక్కడితో ఆగుతుందా? ఆ అనలిస్ట్‌లు చెప్పింది నిజమేనా? లేక నిర్మాణ సంస్థ చెప్పింది నిజమా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.