ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఏ సినిమా కూడా సరిగ్గా ఆడడం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలవుతున్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువ ఎదురుచూసింది ’83’ సినిమా కోసమే. అది 1983 వరల్డ్ కప్ విజయం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. పైగా రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ సహా పేరున్న తారలు నటించారు.
ఈ భారీ అంచనాలున్న సినిమా.. ‘పుష్ప’ దెబ్బకు విలవిలలాడింది. మంచి టాక్ తెచ్చుకున్న ’83’ని పక్కకు నెట్టేసి ‘పుష్ప’ బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఊపేసింది. భారీ వసూళ్లను సాధించింది. ఆ తరువాత ‘కశ్మీర్ ఫైల్స్’ అనే చిన్న సినిమా అక్కడ సంచలనం రేపింది. అందరూ మార్చిలో అక్షయ్ కుమార్ సినిమా ‘బచ్చన్ పాండే’ కోసం ఎదురుచూస్తుంటే.. వారం ముందు వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ లో లీడ్ తీసుకుంది. దాని ముందు ‘బచ్చన్ పాండే’ నిలవలేకపోయింది.
ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి ‘బచ్చన్ పాండే’పై మరింత ఎఫెక్ట్ చూపించింది. రీసెంట్ గా విడుదలైన ‘ఎటాక్’ పరిస్థితి కూడా అలానే అయింది. సరైన ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 14న విడుదల కాబోయే రెండు సినిమాలపై పడింది. ఆ రోజు హిందీ ‘జెర్సీ’తో పాటు కన్నడ డబ్బింగ్ సినిమా ‘కేజీఎఫ్2’ కూడా విడుదలవుతోంది. ఇప్పటివరకు చూసుకుంటే క్లాస్ సినిమాలు బాలీవుడ్ లో పెద్దగా ఆడడం లేదు.
సౌత్ నుంచి విడుదలయ్యే మాస్ మసాలా, యాక్షన్ సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆడుతున్నాయి. ఇదే గనుక కంటిన్యూ అయితే ‘జెర్సీ’ సినిమాకి ‘కేజీఎఫ్2’ నుంచి ముప్పు తప్పదేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు వాయిదా పడి విడుదలవుతున్న ‘జెర్సీ’ నిర్మాతలకు ఎంతవరకు లాభాలను తీసుకొస్తుందో చూడాలి!