క్యాస్టింగ్ కౌచ్ పై సినీ తారలు తమ అభిప్రాయాలను కొన్ని రోజులుగా దైర్యంగా బయటపెడుతున్నారు. పరిశ్రమల్లో తమకి అటువంటి అనుభవం ఎదురుకాలేదని కొంతమంది అంటుంటే… ఎక్కువమంది తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమేననని వాపోతున్నారు. సమ్మోహనం సినిమాతో తెలుగువారికి పరిచయమైన భామ అతిథిరావు హైదరి తనకి బాలీవుడ్ లో లైంగిక ఒత్తిడిలు ఎదురయ్యాయని, నో చెప్పినందుకే ఛాన్స్ లు లేకుండా ఖాళీగా ఉన్నానని చెప్పింది. మెగా హీరోయిన్ నిహారిక అయితే తనకి సినీ నేపథ్యం ఉంది కాబట్టి అటువంటి సంఘటనలు ఎదురుకాలేదని నిర్మొహమాటంగా చెప్పింది. తాజాగా ఈ విషయంపై నటి రాయ్ లక్ష్మి స్పందించింది. ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న నటీమణులకు క్యాస్టింగ్ కౌచ్ తప్పదని స్పష్టం చేసింది.
కొత్తగా వచ్చిన వాళ్లు.. లొంగిపోవడమా? లేదంటే అవకాశాలు వదులుకోవడమా? అనేది వాళ్లే నిర్ణయించుకోవాలని తెలిపింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే మాత్రం కాంప్రమైజ్ కాక తప్పదని కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పింది. అవకాశాల కోసం కాంప్రమైజ్ కావడమనేది చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోందని, తనకు వ్యక్తిగతంగా ఇలాంటి అనుభవం ఎదురవనప్పటికీ ఇండస్ట్రీలో తాను గమనించింది మాత్రం ఇదేనని రాయ్ లక్ష్మీ వెల్లడించింది. ఆమె మాటలు ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను చర్చకు దారితీసింది. ఈ ఆరోపణల ప్రభావం రాయ్ లక్ష్మీపై పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.