పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ఏడాది మిగిలిన హీరోల కంటే ఎక్కువగా షూటింగ్ లలో పాల్గొంటూ వచ్చాడు. ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ ‘సలార్’ వంటి సినిమాల షూటింగ్లలో ఎడతెగకుండా పాల్గొన్నాడు. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న టైంలో పక్క రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పట్టాయి.దీంతో ప్రభాస్ సినిమాల షూటింగ్ లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లో అలాంటి అడ్డంకులు లేవు కాబట్టి.. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి తిరిగి ఇక్కడ షూటింగ్ చేయొచ్చు అని ప్రభాస్ చిత్రాలకు సంబంధించిన యూనిట్ సభ్యులు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారట.
మూడు సినిమాలు హైదరాబాద్ లోనే షూటింగ్ జరిపితే వేగంగా పూర్తి చేయొచ్చు అని ప్రభాస్ సంతోషించాడట. అందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ ఈరోజు ఊహించని విధంగా షాక్ తగిలింది.తెలంగాణలో కూడా లాక్ డౌన్ పెడుతున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న మొన్నటి వరకు అసలు లాక్ డౌన్ పెట్టే ఉద్దేశం లేదని చెప్పిన కె.సి.ఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీం ను ఇది ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఆ చిత్రం టీం సభ్యులు హైదరాబాద్ కు చేరుకున్నారు. దర్శకుడు ఓం రౌత్ తో సహా చాలా మంది ఇక్కడికి చేరుకున్నట్టు సమాచారం. ఇక షూటింగ్ ఏర్పాట్లకు, రవాణా ఖర్చులు వంటి వాటికి నిర్మాతకు గట్టిగానే ఖర్చు అయినట్టు వినికిడి. ఇప్పుడంతా వేస్ట్ అయిపోయిందట.