సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (S. S. Rajamouli)..ల కలయికలో ఓ భారీ బడ్జెట్ సినిమా (SSMB29) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ్, ఎస్.గోపాల్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పేరుకు వీళ్ళిద్దరూ నిర్మాతలు అయినప్పటికీ ఈ సినిమాకి చాలా మంది పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) , గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఆన్ లొకేషన్ నుండి ఇప్పటికే కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అవి ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. మహేష్ బాబుకి ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకుంటారు అనే ప్రచారం జరిగింది. ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్టులో భాగం అయినప్పుడు.. అభిమానులు ఆమె హీరోయిన్ గా వద్దు అంటూ కామెంట్లు పెట్టారు. మహేష్ సరసన ఆమె పెద్ద అమ్మాయిగా కనిపిస్తుంది అంటూ వారు అభిప్రాయపడ్డారు.
దీంతో కొన్ని మీడియా సంస్థలు ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదని, కీలక పాత్ర మాత్రమే అని చెప్పుకొచ్చాయి. దీంతో మహేష్ అభిమానులు కూల్ అయ్యారు. కానీ తాజాగా శంకరపల్లి శివార్లలో కీలక షెడ్యూల్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహేష్ బాబు – ప్రియాంకా చోప్రా పై ఒక పాటను చిత్రీకరించారట రాజమౌళి.
ఏప్రిల్ 30 అంటే నేటితో ఆ షెడ్యూల్ పూర్తయ్యింది. మహేష్, ప్రియాంక పై పాట అనేసరికి మళ్ళీ అభిమానుల్లో హీరోయిన్ విషయంలో ఓ కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఈ పాటలో ప్రియాంక చోప్రా కూడా ఉంది అనుకోవాలా లేక వీరిపై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారా? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా మారింది.