వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు యువహీరో నాని. తాను చేసే కథలు భిన్నంగా ఉండేలా చూసుకుంటూనే అందులో రొమాన్స్, కామెడీ మిస్సవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆది నుండి నాని వరుస ఇదే. అదే అతని బలం కూడా. అందుకే అతడి సినిమాలు సుమారుగా ఉన్నా వసూళ్లతో సూపర్ హిట్ గా మారిపోతుంటాయి. మరోవైపు తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తోనే సున్నిత భావోద్వేగాలను, హాస్యాన్ని సమపాళ్లలో జోడించి మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు విరించి వర్మ. ఈ శైలి కథలు నానికి అచ్చంగా అతికినట్లుంటాయి. అందుకే వీరి సినిమాకి ‘మజ్ను’ అని టైటిల్ పెట్టినా విషాదం స్థానంలో వినోదం ఉంటుందని చెప్పారు. ఈ విషాదం, వినోదం మాటున ఉన్న ‘మజ్ను’ కథేంటన్నది ఇప్పుడు చూద్దాం..!!
కథ : ఆదిత్య (నాని) ఇంజనీరింగ్ చదివినా సినిమాలపై మక్కువతో రాజమౌళి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తుంటాడు. ఆ సమయంలోనే మితృడు కాశీ (సత్య) ద్వారా సుమాంజలి (ప్రియశ్రీ) పరిచయమవుతుంది. పరిచయం ప్రేమగా మారాక ఆదిత్య తను గతంలో ప్రేమించిన అమ్మాయి కిరణ్ (అను ఇమాన్యుయెల్) గురించి చెబుతాడు. చెప్పే క్రమంలో తను ఇప్పటికీ ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నట్టు గుర్తించి, సుమ పట్ల తనకున్నది ఆకర్షణే అని తెలుసుకుంటాడు. తర్వాత కిరణ్ కలవాలనుకునే సమయంలో తనే మరోరకంగా ఆదిత్యకు పరిచయమవుతుంది. ఈ ముక్కోణపు ప్రేమకథ ఎలా ముగిసిందన్నదే ‘మజ్ను’కథ.
నటీనటుల పనితీరు : “ఆదిత్య” పాత్రలో నాని మరోసారి తన నేచురల్ యాక్టింగ్ స్కిల్స్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా.. సెంటిమెంట్ సీన్స్ లో ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ మోడ్యులేషన్ తో మెప్పించాడు. తెలుగు తెరకు పరిచయమైన మరో మలయాళ ముద్దుగుమ్మఅను ఎమన్యూల్ అందంగా ఉన్నప్పటికీ.. ఎక్స్ ప్రెషన్స్ వరకూ అలరించలేకపోయింది.
రెండో హీరోయిన్ గా నటించిన ప్రియా శ్రీ, నాని ఫ్రెండ్ గా సత్య, క్యాబ్ డ్రైవర్ గా వెన్నెల కిషోర్ కొంతమేరకు నవ్వించగలిగారు. రాజ్ తరుణ్ స్పెషల్ అప్పీరియన్స్ కు పెద్దగా ప్రాధాన్యత లేదు. అలాగే.. పోసాని కృష్ణమురళి, రాజ్ మదిరాజు, అనితల పాత్రలకు ప్రాముఖ్యత లేదు.
సాంకేతికవర్గం పనితీరు : సంగీత దర్శకుడు గోపీసుందర్ అందించిన బాణీలు బాగున్నాయి. అయితే.. ఫస్టాఫ్ లోనే నాలుగు పాటలు వరుసబెట్టి వినిపించేయడంతో, పాటలు ఎంత వినసోంపుగా ఉన్నా ప్రేక్షకుడు మాత్రం బోర్ ఫీలవుతాడు. జ్ణానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశంలోని ఎమోషన్ కు తగ్గట్లుగా లైటింగ్ ను, గ్రే టింట్ ను వినియోగించిన విధానం అభినందనీయం. సినిమా ఉన్నదే 2.18 గంటలు.. ఆ కొద్ది సమయంలోనే చాలా ల్యాగులున్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పరంగా ఇంకాస్త నిర్దయగా వ్యవహరించి ఉంటే.. సినిమా ఔట్ పుట్ ఇంకాస్త బాగుండేది.
“ఉయ్యాల జంపాల” చిత్రంతో వయోబేధం లేకుండా అందరి మన్ననలూ అందుకొన్న దర్శకుడు విరించి వర్మ రెండో సినిమా కోసం ఏకంగా మూడేళ్ళ విరామం తీసుకొని మరీ “మజ్ను” కథను సిద్ధం చేసుకొన్నాడు. కథ వరకూ పర్లేదు కానీ కథనం విషయంలో మాత్రం తడబడ్డాడు. సన్నివేశంలోని భావాన్ని మాటలతో కంటే పాటలతో చెప్పాలని వర్మ చేసిన ప్రయోగం వికటించింది.
విశ్లేషణ : నాని మునుపటి చిత్రాల మాదిరి “మజ్ను” కూడా విశేషంగా అలరిస్తుందనో, హాయిగా నవ్వుకోవచ్చనో థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు నిరాశచెందక తప్పదు. అలాగే “ఉయ్యాల జంపాల” చిత్రంతో ప్రేమ పరవసంతోపాటు బాల్యంలోని మధురంతో ఓలలాడించిన దర్శకుడు విరించి వర్మ తన రెండో చిత్రంతో ఆశించిన స్థాయిలో అలరించలేదనే చెప్పాలి.