ఐపీఎల్‌లో వరుస విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌లో బోల్తాపడినట్లు.. వరుస విజయాలు అందుకున్న మలయాళ సినిమా పరిశ్రమకు సడెన్ బ్రేక్ పడింది. అంటే అక్కడ అన్నీ విజయాలేనా అని అనొచ్చు. మా ఉద్దేశం అది కాదు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ విజయాలు అందుకున్న మాలీవుడ్‌కి ఇప్పుడు మమ్ముట్టి (Mammootty) తన కొత్త సినిమాతో బ్రేక్ వేశాడు అని చెప్పాలి. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొత్త సినిమా ‘టర్బో’ గురువారం విడుదలైంది.
ఈ సినిమాకు కేరళనాట ఎంతటి బజ్ ఉందనే విషయం పక్కన పెడితే.. ఇక్కడ హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో షోలు వేశారు. ఆ లెవల్‌లో ఇటీవల మన జనాలు మలయాళ సినిమాలను సబ్ టైటిల్స్‌తో చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇటీవలి మళయాళ సినిమాల్లాగే ‘టర్బో’ కూడా భారీ విజయం అందుకుంటుందేమో అనుకుంటే నిరాశపరిచింది అంటున్నా ఫ్యాన్స్. ‘ప్రేమలు’ (Premalu) , ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) , ‘భ్రమ యుగం’, ‘గోట్ లైఫ్: ఆడు జీవితం’(The Goat Life), ‘ఆవేశం’ అంటూ ఇటీవల కాలంలో వరుస విజయాలు అందుకుంది మాలీవుడ్.
దీంతో ఇప్పుడు ‘టర్బో’ వాటికి యాడ్ అవుతుంది అనుకుంటే.. తేడా కొట్టింది. అనుకున్నంత మేర సినిమా ఉండకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. షోలు కూడా తగ్గిపోయాయి అని అంటున్నారు. ఇక సినిమా కథ సంగతి చూస్తే.. స్నేహితుల కోసం ఏదైనా చేసే జోస్ (మమ్ముట్టి).. తన ఫ్రెండ్ అడిగాడని అతను ప్రేమించిన ఇందు (అంజనా జయప్రకాశ్)ని తీసుకొస్తాడు. కానీ ఆమెతో పాటు చెన్నై వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటాడు.
ఎందుకు, ఏమైంది అనేదే సినిమా కథ. యాక్షన్ కామెడీతో మెప్పించాలని ‘మన్యం పులి’ ఫేమ్ దర్శకుడు వైశాఖ్ ఆ మ్యాజిక్ చేయలేకపోయారు. దీంతో మాలీవుడ్ విన్నింగ్ స్ట్రీక్‌కి బ్రేక్ పడింది అంటున్నారు. అయితే మలయాళ సినిమా బంగారం అంటూ మన సినిమాను తక్కువ చేసే ‘సెల్ఫ్ సర్టిఫైడ్ విశ్లేషకులు’ ఇప్పుడు ఏమంటారో చూడాలి.