‘గాడ్‌ఫాదర్’ సినిమాను చిరంజీవి నిశ్శబ్ద విప్లవంతో పోల్చారు. అంటే శబ్దం లేకుండా సినిమాను అదరగొడుతుంది అని ఆయన ఉద్దేశం. నిజానికి ఈ కథ అందరికీ తెలిసిందే. ఓటీటీల్లో, స్ట్రీమింగ్ యాప్స్‌లో ఈ సినిమాను చూసేశారు కూడా. అయితే ఈ సినిమాను చిరంజీవి ఎలా చేశాడు అని చూడటానికి అక్టోబరు 5 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మాతృక సినిమాలో లేని పది కొత్త పాత్రలు ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు మోహన్‌రాజా చెప్పారు. దీంతో ఏంటవి? ఎలా సాధ్యం అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ముందుగా చెప్పినట్లుగా ‘గాడ్‌ఫాదర్’ కథ అందరికీ తెలసిందే. అందులోని ట్విస్ట్‌లు, లాక్‌లు, లాజిక్‌లు అందరికీ తెలిసినవే. దీంతో ఇందులో కొత్త పాత్రలు వచ్చే అవకాశమే లేదు. అయితే సినిమా చూడండి.. మీకే అర్థమవుతుంది మేం ఏ మార్చామో అని దర్శకుడు, సినిమా టీమ్ చెబుతున్నారు. దీంతో ఏంటవి అని ప్రశ్న వస్తోంది. అందులోనూ సినిమాలో పది కొత్త పాత్రలు ఉంటాయని, అవి సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి అని హైప్‌ను పెంచే ప్రయత్నం చేశారు మోహన్‌రాజా.
‘గాడ్‌ఫాదర్’ సినిమా చేయమని మోహన్‌రాజాను అడిగినప్పుడు సినిమా చూశారట. అందులో ఆయనకు ఓ కొత్త కోణం దొరికిందట. దాన్నే చిరంజీవితో చెబితే.. ఆ పాయింట్ నచ్చి ‘గాడ్‌ఫాదర్’ పనులు మొదలయ్యాయట. ఆ కొత్త పాయింట్ ఏంటి అనేది ఆయన చెప్పలేదు. సినిమాలో ముఖ్యమైన చిరు సోదరుడి పాత్రను తీసేశారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా కొత్త పాత్రలు రావడం గురించి వార్తలు బయటకు రావడం విశేషం.
మోహన్‌రాజా ఎంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు అంటే.. ‘గాడ్ ఫాదర్’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. కావాలంటే ‘లూసీఫర్’ని చూసి రండి. అప్పటికీ ‘గాడ్‌ఫాదర్’ కొత్తగానే కనిపిస్తుంది అని చెప్పారు మోహన్‌రాజా. అంతేకాదెఉ 2.5 గం.ల నిడివి ఉన్న ‘లూసీఫర్’లో హీరో మోహన్ లాల్ 50 నిమిషాలే కనిపిస్తారు. కానీ ‘గాడ్ ఫాదర్’లో చిరంజీవి 2 గంటలపాటు తెరపై సందడి చేస్తారు అంటున్నారు. అంతగా ఏమి మార్చారో రేపు తెలిసిపోతుంది.