బాలీవుడ్ డ్రగ్స్ కలకలం వెబ్ సిరీస్ ఎపిసోడ్లలా సాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న ఒక సప్లయిర్, యువ కథానాయికను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) వాళ్లు పట్టుకున్నారు. ఇంకా ఆ విషయం మరవక ముందే పెద్ద ఎత్తున మత్తుమందుల్ని ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటన్ పౌరుడి నుంచి 200 కిలోల గంజాయిని ఎన్‌సీబీ పట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఈ వ్యవహారానికి సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి కూడా తీసుకున్నారట.
పోలీసుల అదుపులో ఉన్న వాళ్లలో ఒకరు నిన్నటి తరం నాయిక దియా మీర్జా మాజీ మేనేజర్ రహీలా ఫర్నీచర్‌వాలా. మరో వ్యక్తి అతని సోదరి సాహిస్తా. గంజాయి రవాణా జరుగుతోందనే పక్కా సమాచారంతో అధికారులు బాంద్రాలోని ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారట. కరణ్ సజ్నానీ అనే బ్రిటన్ వ్యక్తి నంఉచి ఇంపోర్టెడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అతని నుంచి వచ్చిన సమాచారంతో రహీలా, సాహిస్తాను అదుపులోకి తీసుకొని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
200 కిలోల గంజాయిని దేశంలో వివిధ ప్రాంతాలకు చిన్న మొత్తాల్లో పంపించేలా కరణ్ ప్రయత్నాలు చేస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసు విషయంలో కరణ్‌కు కూడా సంబంధం ఉందట. అనూజ్ కేస్వానికి కరణ్ మత్తుమందు పంపిణీ చేసేవాడని గతంలో వార్తలొచ్చాయి. కేస్వానిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అసిస్టెంట్ డైరెక్టర్ రిషికేశ్ పవార్ గురించి ఎన్‌సీబీ అధికారులు ఇంకా వెతుకుతున్నారు.