రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. డిసెంబర్ 3వ తేదీన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ కానుందని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు. సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆర్ఆర్ఆర్ మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు. అయితే ఏపీలో టికెట్ రేట్లు తగ్గడంతో ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాత్రం టెన్షన్ పడుతున్నారు. భారీ మొత్తానికి ఆర్ఆర్ఆర్ హక్కులను కొనుగోలు చేసిన ఏపీ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు కొన్న రేట్ల ప్రకారం లాభాలు వచ్చే అవకాశం ఉందా? లేదా? అని ఆలోచిస్తున్నారు.
ఈ సినిమా హక్కులు కొన్న నెల్లూరు బయ్యర్ నిర్మాత దానయ్యను రేటు తగ్గించాలని కోరారని తెలుస్తోంది. ఏపీలోని మరో బయ్యర్ కూడా రేటు తగ్గించకపోతే ఆర్ఆర్ఆర్ హక్కులను వదిలేస్తానని నిర్మాతకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు కొత్త వైరస్ కు సంబంధించిన వార్తలు దానయ్యతో పాటు ఇతర నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాయి. ఏపీలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులు క్రియేట్ చేసేది. తక్కువ టికెట్ రేట్లతో ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడం కష్టమే అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అటు మెగా అభిమానులతో పాటు ఇటు నందమూరి అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.