నిఖిల్, రాజమౌళి ఫోన్ ముచ్చట్లు
- November 17, 2016 / 12:12 PM ISTByFilmy Focus
రాజమౌళి కలల చిత్రం ‘బాహుబలి’ ఎంతటి ఖ్యాతి తెచ్చుకుందో ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బడ్జెట్ మొదలు కలెక్షన్ల వరకు భారతీయ సినిమాని ఒక కుదుపు కుదిపేసింది. ఇక తెలుగు సినిమాకి టాలీవుడ్ లో గల క్రేజ్ ఇంతా అంతా కాదు. వరుస విజయాలు అందుకుంటున్న హీరోలు కూడా తమ సినిమాల్లో ‘బాహుబలి’ని ఏదో ఒకలా భాగం చేస్తున్నారంటే ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మొన్నటికి మొన్న ‘మజ్ను’గా తెరమీదికొచ్చిన నాని అందులో ‘బాహుబలి’ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసే పాత్రలో కనపడ్డాడు. కథ అవసరం దృష్ట్యా, నాని మీద గల అభిమానంతో రాజమౌళి కూడా తళుక్కుమన్నారు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్తదనం పంచి సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇప్పుడు నిఖిల్ కూడా అచ్చంగా నానినే అనుసరిస్తున్నాడు. నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నిఖిల్ ‘బాహుబలి’ సినిమాకి గ్రాఫిక్స్ విభాగంలో పనిచేసే అర్జున్ పాత్రలో దర్శనమివ్వనున్నాడట. ఈ సినిమాలో రాజమౌళి కనపడనప్పటికీ ఆయనతో నిఖిల్ జరిపిన ఫోన్ ముచ్చట్లు ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతాయని చిత్ర బృందం నమ్మకంగా ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














