నటులు వారు నటించిన చిత్రాలను ఎప్పుడెప్పుడు చూసుకుందామా? అని ఉంటారు. హీరోలయితే సినిమా థియేటర్లలోకి వచ్చే లోపున అనేక సార్లు చూస్తారు. రిలీజ్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి మళ్లీ చూస్తారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తాను నటించిన చిత్రాల్లో రెండింటిని ఇప్పటికీ చూడలేదు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పారు. హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటించిన “సప్తగిరి ఎక్స్ ప్రెస్” ఆడియో రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ “నేను నటించిన చిత్రాల్లో ఇంత వరకు రెండింటిని చూడలేదు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా టీజర్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారి అయిన దీనిని చూస్తాను” అని అందరిముందు చెప్పారు.
దీంతో పవన్ చూడని సినిమాలు ఏమిటి? అనే చర్చ అభిమానులలో మొదలయింది. కొంతమంది ఆ సినిమాలు కొమురం పులి, పంజా అని చెబుతుండగా, మరికొంతమంది గుడుంబా శంకర్, కొమురం పులి అని అంచనా వేస్తున్నారు. అయితే ఎందుకు చూడలేదనే మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ అన్న మెగా స్టార్ చిరంజీవి కూడా తాను నటించిన వాటిలో రెండింటిని ఇంతవరకు చూడలేదు. అవి లంకేశ్వరుడు, మృగరాజు. వీటిని చూడకపోవడానికి కారణం ఆ చిత్ర దర్శకులు దాసరి నారాయణ రావు, గుణశేఖర్ లతో వివాదాలు. మరి తమ్ముడు చూడకపోవడానికి కారణం కూడా అదే అయ్యి ఉంటుందా ?లేదా.. సినిమా బాగా రాలేదని కోపమా?.. వీటికి సమాధానం పవర్ స్టార్ ఒక్కరికే తెలుసు.