ఈ మధ్యకాలంలో హిందీ, తమిళ చిత్రాలను మాత్రమే కాదు కాస్త హై బడ్జెట్ తెలుగు సినిమాలను కూడా హాలీవుడ్ సినిమాల స్థాయిలో కంపేర్ చేస్తున్నారు మన ప్రేక్షకులు. అందుకే వారి అంచనాలను అందుకోవడం కోసం మన తెలుగు సినిమా దర్శకనిర్మాతలు, కథానాయకులు తమ సినిమాల్లో హాలీవుడ్ స్టాండర్డ్ ఫైట్స్, చేజ్ సీక్వెన్స్ లు ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 40 లేదా అంతకుమించిన బడ్జెట్ తో సినిమాలు తీసే దర్శకనిర్మాతలే హాలీవుడ్ స్టాండర్డ్స్ గురించి ఆలోచిస్తుంటే.. 100 కోట్లపైన బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించే “సాహో” లాంటి బృందం ఇంక ఏ రేంజ్ లో ఆలోచించాలి చెప్పండి. అందుకే.. “సాహో” టీం దాదాపు 40 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దుబాయ్ లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఆ షెడ్యూల్ నిన్నటితో ముగిసింది.
ఈ సందర్భంగా దుబాయ్ మీడియాతో ముచ్చటించిన ప్రభాస్.. “సాహో” సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలను, దుబాయ్ షెడ్యూల్ గురించి బోలెడన్ని విషయాలు చెప్పాడు. ముఖ్యంగా.. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ సారధ్యంలో ఒక భారీ చేజ్ సీక్వెన్స్ షూట్ చేశారట. ఈ షూట్ లో భాగంగా 37 కార్లు మరియు 5 ట్రక్స్ ను పేల్చేసారట. సినిమా చూస్తున్నప్పుడు రియలిస్టిక్ ఫీలింగ్ కోసమే అలా తక్కువ సి.జి వర్క్ తో ఈ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారట. ఈ సీన్స్ తప్పకుండా అలరిస్తాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు ప్రభాస్.