నిజ జీవితంలో మామా అల్లుళ్ళు అయిన హీరోలు ఓ సినిమా చేస్తున్నారు అంటే.. ఆ సినిమా పై భారీ అంచనాలు నెలకొంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న ‘వెంకీమామ’ కూడా అదేస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ‘ప్రేమమ్’ చిత్రంలో వీరిద్దరూ కాసేపు కనిపించినందుకే దగ్గుబాటి, అక్కినేని అభిమానులు ఫిదా అయిపోయారు. అలాంటిది ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే.. ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. పైగా ఈ ఇద్దరూ ఈఏడాది ‘ఎఫ్2’ ‘మజిలీ’ వంటి బ్లాక్ బస్టర్లు కొట్టి పిచ్చ ఫామ్లో ఉన్నారు. ఇక బాబి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ తో కలిసి ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నిర్మిస్తోంది. డి.సురేష్ బాబు, విశ్వప్రసాద్ వంటి ఇద్దరి నిర్మాతలు ఉండడంతో ఈ చిత్రం బడ్జెట్ విషయంలో అదుపు తప్పిందని తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఈ చిత్రానికి 55 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యిందట. ఎంత బ్యాలన్స్డ్ గా వ్యవహరించినా బడ్జెట్ ఎక్కువైపోతుండడంతో ఇప్పుడు ‘కాస్ట్ కటింగ్లు’ చేసే పనిలో ఇద్దరు నిర్మాతలు పడ్డారని తెలుస్తుంది. మొదట అక్టోబర్ 5 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ‘సైరా’ ఉండడంతో అక్టోబర్ 25 కు మార్చారు. ఇప్పుడు బడ్జెట్ సమస్యలు వచ్చాయి కాబట్టి.. విడుదల డిసెంబర్ నెలకు మార్చబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.