కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజుకి లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ ను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్, కర్ఫ్యూ లు విధిస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నాయి. డబుల్ మాస్క్ వేసుకోవాలని చెబుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉపాధిని కోల్పోయి.. తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వారికి కొందరు సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు.
స్వచ్చంద సంస్థలతో కలిసి పేదలను ఆదుకుంటున్నారు. నటి రాశిఖన్నా కూడా ఈ లిస్ట్ లో చేరింది. రోటీ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి పేదల ఆకలి తీర్చడానికి ఆమె ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఆమె కొద్దిరోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఓ పేదవాడి ఆకలి తీర్చడానికి రూ.40 విరాళంగా ఇస్తే చాలని కోరింది. రాశిఖన్నా కోరినట్లుగా ఆమె అభిమానులు రోటీ ఫౌండేషన్ సంస్థకు భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు.
దీంతో రాశి హైదరాబాద్ లో ఆకలితో బాధపడుతున్న వారికి రోటీలు అందించింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన రాశి.. ఆకలి అన్నింటికంటే భయంకరమైన రాక్షసి అంటూ చెప్పుకొచ్చింది. తన పిలుపు మేరకు విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పింది. విరాళాలను ఎంతో జాగ్రత్తగా వినియోగిస్తున్నామని.. దాతలు ముందుకొస్తే మరికొందరికి సాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు.