తల్లి చీరల్ని, నాన్నమ్మ / అమ్మమ్మ చీరల్ని రీ డిజైన్ చేసి పెళ్లికి ధరించిన వాళ్లను మనం చూసుంటాం. సెలబ్రిటీలు గతంలో ఈ పని ఎక్కువగా చేసేవారు. ఆ తర్వాత సగటు జనాలు కూడా ఇదే పని చేస్తున్నారు. ఆ ఫొటోలు, దాని వెనుక కథలు కూడా వైరల్‌గా మారుతున్నాయి. అయితే తనకు తన నాయనమ్మ పెళ్లికి ఇచ్చిన చీరను అందుకు కాకుండా వేరే దానికి వాడతాను అని చెబుతోంది ప్రముఖ నటి సాయిపల్లవి. ఈ క్రమంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది.
గతేడాది ‘అమరన్’(Amaran) సినిమాలో ఇందుగా అలరించిన సాయిపల్లవి(Sai Pallavi) ఇప్పుడు ‘తండేల్’ (Thandel) సినిమాలో బుజ్జితల్లిగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె వివిధ మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో జాతీయ అవార్డు సాధించాలన్న తన కలను బయటపెట్టింది. దాని వెనకున్న కారణాన్ని కూడా చెప్పింది. వినడానికి కాస్త వింతగా ఉన్నా.. అవార్డు, ఆ పని విషయంలో ఆమె సీరియస్‌నెస్ అర్థం చేసుకోవాలి.
సాయిపల్లవికి 21 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ ఒక చీర ఇచ్చారట. తాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చీర కట్టుకోమని వాళ్ల అమ్మమ్మ చెప్పింది. అయితే అప్పటికి ఆమె ఇంకా సినిమాల్లోకి రాలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు కట్టుకుందాం అని అనుకుందట. అయితే అది జరిగిన మూడేళ్ల తర్వాత ‘ప్రేమమ్’ సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ సమయంలో ఏదోక రోజు ఈ రంగంలో నేషనల్ అవార్డు అందుకుంటానని నమ్మకంగతా చెప్పింది.
మనకి అంత గొప్ప అవార్డు జాతీయ అవార్డే. అందుకే దాన్ని దక్కించుకున్న రోజు అమ్మమ్మ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని అనుకుంటున్నాను. నా జాతీయ అవార్డు కలకు.. అమ్మమ్మ చీరతో కనెక్షన్ ఉండిపోయింది. దీంతో ఆమెకు అర్జెంట్‌గా నేషనల్ అవార్డు ఇచ్చేయండి అని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇప్పుడు ‘అమరన్’, ‘తండేల్’ లాంటి సినిమాలు చేసింది వాటికి ఆ ఛాన్స్ ఉందని సమాచారం.