‘విక్రమార్కుడు’ సినిమాలో ‘నీకు భయం అంటే తెలుసా’ అని ప్రకాష్ రాజ్ అడగగా మన రవితేజ ‘ప్రతి రోజు భయపడుతుంటాను సార్’ అంటూ ఓ రెండు పేజీల డైలాగులు చెబుతాడు. ఇప్పుడు సాయిపల్లవి కూడా అదే ఫార్మాట్ లో మరీ రెండు పేజీలు కాదు కానీ.. ఒక నాలుగైదు లైన్లలో ఇంచుమించుగా అదే డైలాగ్ చెప్పింది. “నేను ప్రతి సినిమా కథ సెలక్ట్ చేసుకొనేప్పుడు భయపడతాను, సినిమాలో నటిస్తున్నప్పుడు భయపడతాను, అలాగే.. సినిమా రిలీజయ్యాక ఆడియన్స్ నా యాక్టింగ్ ను ఎలా రిసీవ్ చేసుకొంటారో అని భయపడుతుంటాను” అని భయం దండకం చదివిందట తమిళ మీడియా ముందు.
దాంతో నవ్వాలో, సైలెంట్ గా మిన్నకుండిపోవాలో అర్ధం కాక కన్ఫ్యూజన్ లో అలా కూర్చుండిపోయారట తమిళ మీడియా రిపోర్టర్లు. “కణం” తమిళ వెర్షన్ రిలీజ్ ను పురస్కరించుకొని మీడియాతో ముచ్చటించిన సాయిపల్లవి ఈ విధంగా మీడియా ముందు భయాన్ని ప్రదర్శించింది. అదే సందర్భంలో మాట్లాడుతూ.. “ఇప్పుడు నాకంటూ మంచి గుర్తింపు వచ్చింది, అందుకే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను” అని చెప్పడం గమనార్హం.