త్రివిక్రమ్ డైలాగులు మీద రాసే కామెడీలు ఇతర భాషల్లో అంతగా వర్కవుట్ కావటం లేదనే టాక్ చాలా కాలంగా ఉంది. అది చాలా సార్లు నిజం అని ప్రూవ్ అయ్యింది కూడా. అయినా తెలుగులో హిట్ అవ్వగానే వెంటనే ఉత్సాహంతో వాటి రైట్స్ తీసుకుని రీమేక్ చేసేయటం ఆనవాయితీగా మారింది. అలా రీసెంట్ గా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను హిందీలో ‘షెహజాదా’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ ధావన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిందీలో డిజాస్టర్ అయ్యింది.
అయితే సినిమా పోతే వసూళ్లు రాకపోవటంతో…టీమ్ కు బకాయిలు కూడా క్లియర్ చేయరు చాలా మంది నిర్మాతలు. ఇప్పుడు అదే జరుగుతోంది ఈ చిత్రం టీమ్ కు. ఈ సినిమా కోసం పనిచేసిన కొంత మంది సిబ్బందికి దాదాపు రూ. 30 లక్షలు చెల్లింపులు నిలిచిపోయాయనే వార్త ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత సుమారు 60 నుంచి 90 రోజుల్లో ఆ సినిమాకు పని చేసిన అందరికీ చెల్లింపులను క్లియర్ చేయాలనేది ఇండస్ట్రీలో పెట్టుకున్న ఒక నియమం.
అయితే ‘షెహజాదా’ (Shehzada) విడుదల అయి దాదాపు నాలుగు నెలలు దాటినా కూడా ఈ సినిమాకు పనిచేసిన సిబ్బంది అలాగే బయ్యర్లుకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదని బాలీవుడ్ మీడియా అంటోంది. అయితే ఈ విషయమై కేసులు గట్రా పెట్టలేదు. మీడియాకు లీక్ చేసారు అంతే. మీడియాలో వార్తలు వస్తే అయినా తమకు క్లియరెన్స్ లు జరుగుతాయనే ఆశ కావచ్చు.
ఇక ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమా ఏప్రిల్ 14 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ అల్లు అర్జున్ పోషించిన పాత్రను అక్కడ కార్తిక్ ఆర్యన్, పూజాహెగ్డే పాత్రలో కృతిససన్ నటించారు. పరేశ్‌రావల్, మనీషా కొయిరాలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీను అల్లు అరవింద్ సమర్పణలో టీ-సిరీస్ ఫిలిమ్స్, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాట్ ఫిలిమ్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై నిర్మించారు.