ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే… విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తండ్రి, మావయ్య, తాత, ప్రతినాయకుడు ఇలా ఏ పాత్రైనా… సరే అందులో పరకాయ ప్రవేశం చేసేసి… ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకోగల కెపాసిటీ ఉన్న నటుడు ప్రకాష్ రాజ్ అనడంలో సందేహం లేదు. అటువంటి ప్రకాష్ రాజ్ తన స్నేహితురాలు గౌరీలంకేష్ హత్య తో మానసికంగా ఆందోళన చెందాడు ప్రకాష్‌రాజ్. తన ట్విట్టర్ ద్వారా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రధాని మంత్రి మోదీ పై యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక సెంట్రల్ నుండీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నాడు ప్రకాష్ రాజ్. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్… లీగల్ నోటీసులతో సతమతవుతున్నట్టు తెలుస్తుంది. గతంలో మలయాళంలో విజయం సాధించిన `సాల్ట్ అండ్ పెప్పర్` చిత్రాన్ని తెలుగులో `ఉలవచారు బిర్యానీ` చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో `తడ్కా` పేరుతో రీమేక్ చేస్తున్నాడు ప్రకాష్ రాజ్.
ఈ రీమేక్‌లో నానా పటేకర్, శ్రియ, అలీ ఫైజల్, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రఖ్యాత ‘జీ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… ఈ చిత్ర లీగల్ రైట్స్ విషయంలో ప్రకాష్‌రాజ్, జీ స్టూడియోస్ కి మధ్య వివాదం చోటుచేసుకుందట. దీనితో ‘జీ స్టూడియోస్’ ప్రకాష్‌రాజ్‌కు బాంబే హైకోర్టు నుండీ లీగల్ నోటీసులు పంపించారట. ప్రకాష్‌రాజ్ సన్నిహితుడు జితేష్‌వర్మ కూడా ఈ రీమేక్ కి ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఈవిషయం పైనే జీ స్టూడియోస్, ప్రకాష్‌రాజ్‌కు మధ్య వివాదం చోటుచేసుకుందని స్పష్టమవుతుంది. అసలు విషయాన్ని పరిశీలిస్తే.. ఈ చిత్ర లాభాల్లో జీ స్టూడియోస్ కి 60 శాతం, మిగతా 40 శాతం జితేష్ వర్మ అండ్ సీమర్ దీక్షిత్‌లకు చెందుతుందిట. ఇక అసలు హక్కుదారుడైన ప్రకాష్‌రాజ్‌కు వాటానే లేదు. ఇక వివాదానికి ఇదే అసలు కారణం అని తెలుస్తుంది. ఈ కారణంతోనే `తడ్కా` చిత్రం ఇంకా విడుదల కాలేదట. మరి ఈ సంవత్సరమైనా ఈ చిత్రం విడుదలవుతుందేమో చూడాలి..!