కొంతమంది సెలబ్రిటీలు రైతులుగా మారి వ్యవసాయం చేస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం.ఎం.ఎస్.ధోని, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ వంటి వారు వ్యవసాయం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా కూడా ఓ నటుడు రైతుగా మారాడట. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటుడు ఆశిష్ శర్మ ముంబై బిజీ లైఫ్ కు దూరంగా ఉంటూ రైతుగా మారి ప్రసాంతకరమైన వాతారణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.
‘సియా కే రామ్’ సీరియల్‌తో పాపులర్ అయిన ఈ నటుడు అందరికీ సుపరిచితమే.టాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపించాడు కానీ కుదర్లేదు. ‘మోదీ: జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్’ వెబ్‌సిరీస్‌లో మోదీ పాత్రని పోషించి దేశం మొత్తం పాపులర్ అయ్యాడు. ముంబైకి దూరంగా రాజస్థాన్లో రైతుగా మారి వ్యవసాయం చేస్తున్నాడు. ఇతను మాట్లాడుతూ.. “మనకి ఉన్న బిజీ లైఫ్ కారణంగా జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం కుదరడం లేదు.ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అయితే కోవిడ్ మూలంగానే మన జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటో నాకు తెలిసొచ్చింది.
ప్రకృతి విలువ, అందులో ఉన్న మాధుర్యం అర్ధమవుతుంది. మా పూర్వీకులు వ్యవసాయం చేసేవారు. ముంబైకి రావడంతో నేను దానికి దూరమయ్యాను. లాక్‌డౌన్ టైములో మా ఊరు నాకు ఎక్కువగా గుర్తుకువచ్చింది.మా ఊళ్లో మాకు 40 ఎకరాల భూమి ఉంది. అలాగే 40 ఆవులు కూడా ఉన్నాయి.ఇంత భూమి ఉన్నప్పుడు మేము ఇంకా ఎక్కువగా సేద్యం చేసి జనాలకు అన్నం పెట్టగలమనిపించింది. ఇందులో ఎంతో ఆనందం కూడా ఉంది” అంటూ ఇతను చెప్పుకొచ్చాడు.